ఈసారైనా కాంగ్రెస్‌ టికెట్‌ లభించేనా? 

Suspense in OU student leaders for Congress ticket - Sakshi

     ఓయూ విద్యార్థి నేతల్లో ఉత్కంఠ

     ఇద్దరికైనా అవకాశం వస్తుందనే ఆశ

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న ఉస్మానియా విద్యార్థి నేతల్లో ఉత్కంఠ నెలకొంది. టికెట్ల ఖరారు ప్రక్రియ కీలక దశకు చేరుకోవడం, రేపోమాపో పార్టీ అభ్యర్థుల జాబితా వస్తుందంటూ ప్రచారం జరుగుతుండటంతో ఈసారైనా తమకు పోటీ చేసే అవకాశం వస్తుందో లేదోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఈసారి టికెట్లు ఆశిస్తున్న 10 మంది విద్యార్థి నేతల్లో ఇద్దరు లేదా ముగ్గురిని అధిష్టానం కరుణిస్తుందనే అంచనాతో ఆశావహులు తమ వంతు లాబీయింగ్‌ చేసుకుంటున్నారు.
 
గత ఎన్నికల్లోనూ భంగపాటే... 
తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక విశ్వవిద్యాలయాల నుంచి ముఖ్యంగా ఉస్మానియా నుంచి పదుల సంఖ్యలో విద్యార్థులు ఉద్యమానికి నేతృత్వం వహించారు. ఇందులో ఎర్రోళ్ల శ్రీనివాస్, బాల్క సుమన్, గాదరి కిశోర్‌ లాంటి వారు టీఆర్‌ఎస్వీలో క్రియాశీలకంగా పనిచేసి కేసీఆర్‌కు అండగా నిలబడ్డారు. వారితోపాటు ఉద్యమంలో దీటుగా నిలిచిన మరికొందరు విద్యార్థి నేతలు ఎప్పటినుంచో కాంగ్రెస్‌కు అండగా నిలుస్తుండగా మరికొందరు 10 నెలల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. వారిలో ఓయూలో ఎన్‌ఎస్‌యూఐలో కీలకంగా పనిచేస్తున్న మానవతారాయ్‌తోపాటు మేడిపల్లి సత్యం, రాజారాం యాదవ్, పున్నా కైలాశ్‌ నేత, దరువు ఎల్లన్న, చరణ్‌ కౌశిక్, క్రిశాంక్, దుర్గం భాస్కర్, బాల లక్ష్మి, కేతూరి వెంకటేశ్, చారగొండ వెంకటేశ్‌ తదితరులున్నారు.

మానవతారాయ్, చరణ్, కైలాశ్‌, సత్యం, రాజారాంలు పార్టీ అధికార ప్రతినిధులుగా కూడా పనిచేస్తున్నారు. మిగిలిన వారూ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే వారిలో కొందరు గత ఎన్నికల సమయంలోనే టికెట్‌ ఆశించినా నిరాశే ఎదురైంది. క్రిశాంక్, ఎల్లన్నల పేర్లు కంటోన్మెంట్‌ స్థానం నుంచి చివరి వరకు ఉన్నా తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్‌ గజ్జెల కాంతంకు కేటాయించారు. మిగిలిన వారికి అవకాశం రాలేదు. కానీ ఈసారి కాంగ్రెస్‌ అధిష్టానం ఓయూ విద్యార్థి నేతల్లో ఒకరిద్దరికి కచ్చితంగా అవకాశం కల్పిం చే యోచనలో ఉందని, పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్‌ పోస్టుల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. 

ఎవరెక్కడ..? 
ఉస్మానియా విద్యార్థి నేతలు ఆశిస్తున్న స్థానాల్లో సగం రిజర్వుడు నియోజకవర్గాలే ఉన్నాయి. మానవతారాయ్‌ (సత్తుపల్లి లేదా కంటోన్మెంట్‌), మేడిపల్లి సత్యం (చొప్పదండి), దరువు ఎల్లన్న (ధర్మపురి), దుర్గం భాస్కర్‌ (బెల్లంపల్లి), క్రిశాంక్‌ (కంటోన్మెంట్‌), చారగొండ వెంకటేశ్‌ (అచ్చంపేట)లు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలను ఆశిస్తున్నారు. మిగిలిన వారిలో రాజారాం యాదవ్‌ (ఆర్మూరు), పున్నా కైలాశ్‌ నేత (మునుగోడు), చరణ్‌ కౌశిక్‌ యాదవ్‌ (ఉప్పల్‌), బాలలక్ష్మి (జనగాం), కేతూరి వెంకటేశ్‌ (కొల్లాపూర్‌)లున్నారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top