
సాక్షి,మేడ్చల్ జిల్లా: మహిళా ఓటర్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాలకు మహిళా నాయకురాళ్లను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టడంతోపాటు మేడ్చల్‌లో సోనియా గాంధీతో భారీ ఎన్నికల బహిరంగసభ నిర్వహించింది. గ్రేటర్‌లో సగ భాగంగా ఉన్న మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ బుధవారం కీసర మండల కేంద్రంలోని కేబీఆర్ కన్వెన్షన్‌లో మహిళా కార్యకర్తలు, నాయకురాళ్లతో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది.
మేడ్చల్ అభ్యర్థి కొంపెల్లి(పెద్ది) మోహన్‌రెడ్డి గెలుపు కోసం నిర్వహిస్తున్న ఈ సభకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరుకానున్నారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరుగనున్న ఈ సభలో మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని 10 మున్సిపాలిటీలు ,61 గ్రామాలకు చెందిన మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు,స్వయం సహాయక సంఘాల సభ్యులను పెద్ద సంఖ్యలో తరలించేందుకు బీజేపీ స్థానిక నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభలో బీజేపీ అభ్యర్థి మోహన్‌రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర ,జిల్లా నాయకులు పాల్గొనున్నారు. బీఎస్‌పీ అభ్యర్థి నక్క ప్రభాకర్ గౌడ్ కూడా మేడ్చల్ నియోజకవర్గంలో రెండు ,మూడు రోజుల్లో పార్టీ అధినేత్రి మాయవతితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.