‘100% వీవీప్యాట్‌’ పిటిషన్‌ కొట్టివేత

Supreme Court dismisses PIL seeking 100 percent verification of VVPAT slips with EVMs - Sakshi

సీజేఐ ఇచ్చిన ఆదేశాలను మార్చలేమన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఓట్లు లెక్కింపులో దేశమంతటా వంద శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించి, వాటిని ఈవీఎంలతో సరిపోల్చాలని కోరుతూ వచ్చిన ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌)ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం ఆర్‌ షాల ధర్మాసనం తాజాగా గుర్తుచేసింది. చెన్నైకి చెందిన ‘టెక్‌4ఆల్‌’ అనే సంస్థ ఈ పిటిషన్‌ వేసింది. సీజేఐ ఇచ్చిన ఆదేశాలను తాము మార్చలేమనీ, ఈ పిటిషన్‌ వేయడం అర్థంలేని పని అని సుప్రీంకోర్టు పేర్కొంది. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా ఈసీకి ఆదేశాలివ్వాలంటూ 21 ప్రతిపక్ష పార్టీలు పిటిషన్‌ వేయగా, మే 7న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అందుకు నిరాకరించడం తెలిసిందే.  

ఈవీఎంల ద్వారా మోసం సాధ్యం కాదు
ఈవీఎంల ద్వారా మోసం చేయడం, వాటిని ట్యాంపర్‌ చేయడం పూర్తిగా అసాధ్యమని ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రణవీర్‌ సింగ్‌ చెప్పారు. ఈవీఎంలు పారదర్శకమైనవని ఆయన పేర్కొన్నారు. ‘ఈవీఎంల డిజైన్‌ దృఢంగా ఉంటుంది. వాటిని ట్యాంపర్‌ చేయడం, హ్యాక్‌ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే వాటికి బయటి నెట్‌వర్క్‌తో కనెక్టివిటీ ఉండదు. ఈవీఎంలకు ఇంటర్నెట్, వైఫై, బ్లూటూత్‌ వంటివి ఏవీ ఉండవు. కేవలం ప్రోగ్రామింగ్‌ చిప్‌ మాత్రమే ఉంటుంది. ప్రోగ్రామ్‌ను ఎవరైనా మార్చాలని చూస్తే ఈవీఎం తీవ్రంగా వైబ్రేట్‌ అయ్యి, స్విచ్ఛాఫ్‌ అయ్యి ఇక పనిచేయకుండా పోతుంది’ అని సింగ్‌ వివరించారు.  

‘పరిశీలకుల’ పిటిషన్‌ విచారణకు నో
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బెంగాల్‌లో ఎన్నికల పరిశీలకులుగా ఇద్దరు పదవీ విరమణ పొందిన ప్రభుత్వం ఉద్యోగుల నియామకాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ల్లో కేంద్ర పోలీస్‌ పరిశీలకుడిగా వివేక్‌ దుబేను, అలాగే పశ్చిమ బెంగాల్‌లో ప్రత్యేక పరిశీలకుడిగా అజయ్‌ నాయక్‌లను నియమించారు. వారిద్దరినీ చట్ట విరుద్ధంగా నియమించారని, దీంతో ఎన్నికల సమయంలో కొన్ని ప్రయోజనాలు చేకూరే అవకాశముందని పిటిషన్‌ పేర్కొంది. ‘ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆర్టికల్‌ 32 ప్రకారం ఈ పిటిషన్‌పై మేం ఎలాంటి విచారణ చేపట్టలేం’ అని కోర్టు పేర్కొంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top