కొంత మంది నేతలకు ‘అజ్ఞానమే వరం’

Sunny Deol asks What is Balakot Air Strike - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ‘వారి అజ్ఞానమే వారికి వరం’ అనుకుంటా! పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలివుడ్‌ నటుడు సన్నీడియోల్‌ను బాలకోట్‌లో భారత వైమానిక దళం జరిపిన దాడుల గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, తనకేమీ తెలియదని చెప్పారు. భారత్‌–పాక్‌ సంబంధాల గురించి ప్రశ్నించగా అది అంతకంటే తెలియదని అన్నారు. హరియాణలోని లాడ్వా నుంచి పోటీ చేస్తున్న తన కుమారుడి తరఫున ప్రచారానికి వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌధురి బీరేంద్ర సింగ్‌ను స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న నీరు, విద్యుత్‌ సమస్యల గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ‘నేనెవరో తెలుసా? కేంద్ర మంత్రిని, నన్ను పట్టుకొని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా?’ అంటూ ఆయన విసుక్కున్నారు.

మిగతా వారిలాగా ఆయన తనకు తెలియదంటూ సమాధానం ఇవ్వలేదు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ సినీ నటి జయప్రదను కొంత మంది రాజకీయ నాయకులు చేస్తున్న మహిళా విద్వేషక విమర్శల గురించి ప్రశ్నించగా తనకు తెలియదంటూ జయప్రద చెప్పడం ఆమె చుట్టూ చేరిన వారిని కూడా ఆశ్చర్యపరిచింది. ఆమెకు వ్యతిరేకంగా అలాంటి వ్యాఖ్యలు చేసన ఆజం ఖాన్‌ గురించి అప్పుడే మరచిపోయినట్లున్నారు. లేదంటే ముస్లిం ఓట్లు పోతాయని అలా సమాధానం ఇచ్చారా? అన్నది ఆమెకే తెలియాలి.

ఇక తృణమూల్‌ ఎంపీ మూన్‌మూన్‌ సేన్‌ను, పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌లో జరిగిన ఎన్నికల హింస గురించి అడగ్గా తనకేమి తెలియదని అన్నారు. అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి బాబుల్‌ సుప్రియో వర్గం, తృణమూల్‌ కార్యకర్త మధ్య జరిగిన హింసాకాండలో ఆయన కారు ధ్వంసంకాగా, పలువురు గాయపడ్డారు.

ఇది గెలవకుముందు అభ్యర్థుల పరిస్థితి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని వాటి ఫుల్‌ఫామ్‌లు అడుగుతుంటే తెలియదని చెబుతూ ఆశ్చర్యపరుస్తున్న నాయకులూ ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top