దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) మరణం తర్వాత కుటుంబంలో గొడవలు వచ్చాయని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ ద్వారా సన్నీ డియోల్ , బాబీ డియోల్ , అజీతా డియోల్ , విజేతా డియోల్ అనే నలుగురు పిల్లలు ఉన్నారు. రెండో భార్య హేమా మాలిని ద్వారా ఈషా డియోల్ , అహానా డియోల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, ధర్మేంద్ర మరణం తర్వాత ఆస్తి విషయంలో విభేదాలు వచ్చినట్లు బాలీవుడ్‌లో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా నటి హేమా మాలిని స్పందించారు.
ధర్మేంద్ర మరణం తర్వాత కూడా సన్నీ డియోల్ , బాబీ డియోల్ సోదరులు కలిసి ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌లో సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే, తమ పిన్ని హేమ మాలినితో పాటు తన కుమార్తెలు ఇద్దరు హాజరు కాలేదు. అయితే, అదే రోజు హేమ మాలిని తన ఇంట్లో గీతోపదేశం ఏర్పాటు చేసుకుంది. రెండు వారాల తర్వాత, హేమ మాలిని ఢిల్లీలో ప్రత్యేకంగా ధర్మేంద్ర సంతాప సమావేశాన్ని నిర్వహించింది. ఇలాంటి ఘటనల తర్వాత వారి కుటుంబంలో గొడవలు వచ్చాయని వార్తలు వైరల్ అయ్యాయి.
వివరణ ఇచ్చిన హేమ మాలిని
హేమ మాలిని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ గొడవలకు సంబంధించి మాట్లాడారు. తాము ఎల్లప్పుడూ బాగున్నామని క్లారిటీ ఇచ్చారు. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని చాలా స్నేహపూర్వకంగానే ఉన్నామన్నారు. కానీ, ప్రజలు ఎప్పుడూ కూడా తమ ఇంట్లో ఏదో తప్పు జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ప్రజలు కూడా ఎప్పుడూ గాసిప్ వార్తలనే కోరుకుంటున్నారని తెలుస్తోంది. 'అలాంటి వారికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి..? వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందా..? ఇది నా జీవితం. నా వ్యక్తిగత జీవితం, మా వ్యక్తిగత జీవితం. మేము పూర్తిగా సంతోషంగా ఉన్నాము.
ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్నాము. అంతే.. అవసరంలేని విషయాలను మా కుటుంబంలోకి తీసుకురాకండి. దీని గురించి నేను ఇంకేమీ చెప్పలేను. నెటిజన్లు ఎలాంటి కథనాలు అల్లుతున్నారో నాకు తెలియదు. ఇతరులకు సంబంధించిన బాధను ఉపయోగించుకుని కొన్ని వ్యాసాలు రాయడం చాలా బాధాకరం. అందుకే నేను అలాంటి ఊహాగానాలకు సమాధానం చెప్పను" అని హేమ మాలిని అన్నారు.
ఢిల్లీలో సంతాప కార్యక్రమం జరపడానికి ప్రధాన కారణం తాను రాజకీయాల్లో ఉండటమేనని హేమ మాలిని అన్నారు. ఆ రంగానికి చెందిన తన స్నేహితుల కోసం మాత్రమే అక్కడ సమావేశం నిర్వహించానని తెలిపారు. ఆపై మధుర తన నియోజకవర్గం కావడంతో వారితో మంచి అనుబంధం ఉందని గుర్తుచేశారు. జనపథ్‌లోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన ధర్మేంద్ర సంతాప సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, ఓం బిర్లాతో పాటు కంగనా రనౌత్, రంజిత్, అనిల్ శర్మ వంటి ఇతర రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.


