పారని పాదుకల పాచిక!

Story On Charan Paduka Yojana - Sakshi

భోపాల్‌ : పాదుకలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకోవాలనుకున్న మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం పాచిక పారలేదు. ఉచితంగా అందించే బూట్లు తీసుకుని ఓట్లు వేస్తారనుకుంటే మొదటికే మోసం వచ్చింది. ఓట్ల సంగతి ఎలా ఉన్నా బూట్ల సంగతి ఎత్తితేనే ప్రజలు భయపడిపోతున్నారు. కనీసం వాటిని ముట్టుకునే సాహసం కూడా చేయడం లేదు. 

మధ్యప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పేదలను ఆకట్టుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చరణ్‌ పాదుకా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. తునికాకు సేకరించే స్త్రీలకు చెప్పులు, పురుషులకు బూట్లూ ఈ పథకం ద్వారా అందజేస్తున్నారు. ఈ పథకం కింద పంపిణి చేసిన వాటిలో కొన్నింటిని సైంటిఫిక్‌ అండ్‌ ఇండ్రస్ట్రీయల్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌కు అనుబంధంగా ఉన్న కేంద్ర తోళ్ల పరిశోధనా సంస్థకు పరిశీలన నిమిత్తం పంపారు. ఆ సంస్థ ఇచ్చిన నివేదిక ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ బూట్లలోని ఇన్నర్‌ సోల్‌కు ‘ఏజెడ్‌ఓ’ రసాయనాన్ని వాడారు.. ఇది క్యాన్సర్‌ కారకం అని కేంద్ర తోళ్ల పరిశోధనా సంస్థ(సీఎల్‌ఆర్‌ఐ) నివేదికలో వెల్లడైంది. ఇది మినహా మిగతా అంతా బాగానే ఉందని ఆ రిపోర్టు తేల్చింది. దీంతో లబ్ధిదారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.  ‘నేను బూట్లు తీసుకుని నెల రోజులయింది..క్యాన్సర్‌ వస్తుందనే భయంతో వాటిని ఇప్పటి వరకు కనీసం ముట్టుకోలేదని’ బిందియా బాయ్‌ అనే లబ్ధిదారుడు తెలిపాడు. అతనే కాదు బూట్లు తీసుకున్న లబ్ధిదారులెవరూ వాటిని వాడడం లేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో బూట్ల పంపిణీని నిలిపివేశారు. 

పర్యావరణానికి హాని
ఈ బూట్లు బయటపడేస్తే పర్యావరణానికి మరింత హాని కలుగుతుందని, ఏజెడ్‌వో రసాయనాన్ని  లెదర్, కాటన్‌ పరిశ్రమల్లో వాడతారని, ఈ రసాయనం పూసిన వస్తువులు వాడడం ద్వారా చర్మ  క్యాన్సర్, గర్భ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని పర్యావరణవేత్త సుభాష్‌ పాండే పేర్కొన్నారు. ‘ఏజెడ్‌ఓ’ వల్ల నీళ్లు, భూమి కూడా కలుషితం అవుతాయని తెలిపారు. 

సోల్‌ మార్చి పంపిణీ చేస్తాం
మొత్తం రెండు లక్షల బూట్లలో లోపలి సోల్‌కు ఏజెడ్‌వో రసాయనం పూసినట్లు గుర్తించాం.  మొత్తం 11.23 లక్షల బూట్లు, 11.11 లక్షల చెప్పుల జతలు లబ్ధిదారులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.   రెండు లక్షల బూట్లలో లోపలి సోల్‌  మార్చి, మరోసారి పరీక్షించిన తర్వాతే లబ్ధిదారులకు తిరిగి వాటిని  పంపిణీ చేస్తామని అటవీశాఖ మంత్రి గౌరీశంకర్‌ సెజ్వార్‌ తెలిపారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top