నిర్మలా సీతారామన్‌కు చేదు అనుభవం

Stones Slippers Hurl at Nirmala Sitaraman - Sakshi

సాక్షి, చెన్నై: కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం తమిళనాడు పర్యటన సందర్భంగా ఆమె కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పుల దాడి జరిగింది. కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటులో కేంద్ర అలసత్వానికి నిరసనగా డీఎంకే కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌ పథకం అమలును సమీక్షించేందుకు కేంద్రం దత్తత జిల్లాలైన రామ్‌నాథపురం, విరుధునగర్‌ జిల్లాలో ఆమె పర్యటించారు.

ఆమె రాక విషయం తెలిసిన డీఎంకే కార్యకర్తలు పార్టీబనూర్‌ జంక్షన్‌ వద్ద కాన్వాయ్‌ను అడ్డగించి రచ్చ రచ్చ చేశారు. ఊహించని ఈ పరిణామంతో కేంద్ర మంత్రి ఖంగుతిన్నారు. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు వారిని చెదరగొట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై ఆమె తన పర్యటనను కొనసాగించారు. ఇక దాడి విషయం తెలుసుకున్న కొందరు బీజేపీ కార్యకర్తలు.. డీఎంకే కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకోవటంతో వివాదం సద్దుమణిగింది. 

ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డును కోరుతూ  తమిళనాడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ​కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్‌ సమావేశాలను కూడా అడ్డుకున్నాయి. ఇక ఆందోళనలో భాగంగా ఏప్రిల్‌ 12న ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనకు వెళ్లగా.. డీఎంకే తీవ్ర స్థాయిలో నిరసన తెలిపింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top