వ్యవస్థల విధ్వంసం సాగనీయం

Sonia Gandhi unveils Karunanidhi's statue - Sakshi

ఎన్డీయే ప్రభుత్వానికి రాహుల్‌ గాంధీ హెచ్చరిక

చెన్నైలో కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా

రాహుల్‌ను ప్రధాని పదవికి ప్రతిపాదించిన స్టాలిన్‌

సాక్షి, చెన్నై: ఎన్డీయే ప్రభుత్వం స్వతంత్ర వ్యవస్థలపై దాడి చేస్తోందని, ఆ ధోరణిని దేశం అనుమతించదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. ఒకరి సిద్ధాంతాలే(ఆరెస్సెస్‌ను ఉద్దేశించి) దేశాన్ని పాలించాలని బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. ఆదివారం చెన్నైలో దివంగత డీఎంకే నాయకుడు కరుణానిధి నిలువెత్తు విగ్రహావిష్కరణ వేడుక జరిగింది. తేనాంపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం ఆవరణలో ప్రతిష్టించిన కరుణానిధి కంచు విగ్రహాన్ని యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తూ..మోదీ సర్కారు రాజ్యాంగబద్ధ సంస్థల స్వయంప్రతిపత్తి, దేశ సంస్కృతిని నాశనం చేస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్ని వర్గాలు, గొంతుకలు కలసి రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దివంగత నాయకుడు కరుణానిధి తమిళ ప్రజల గొంతుకగా నిలిచారని రాహుల్‌ ప్రశంసలు కురిపించారు. భావి ప్రధానిగా రాహుల్‌ పేరును ప్రతిపాదిస్తున్నట్లు ఈ సందర్భంగా స్టాలిన్‌ అనూహ్య ప్రకటన చేశారు. కేరళ,పుదుచ్చేరి, ఏపీ సీఎంలు  పి.విజయన్, నారాయణస్వామి, చంద్రబాబు నాయుడు, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత చిదంబరం, సినీ నటుడు రజనీకాంత్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

భావి ప్రధాని రాహులే!: స్టాలిన్‌
దేశానికి ప్రధాని అయ్యే అన్ని అర్హతలు రాహుల్‌ గాంధీకి ఉన్నాయని, తమిళనాడు నుంచి ఆ పదవికి ఆయన పేరును దివంగత కరుణానిధి వారసుడిగా ప్రతిపాదిస్తున్నట్టు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. జాతీయ స్థాయిలో తన తండ్రి కరుణానిధి పోషించిన పాత్రను గుర్తు చేశారు. 2004లో ఐల్యాండ్‌ గ్రౌండ్‌లో జరిగిన సభలో సోనియా గాంధీని ఉద్దేశించి తొలిసారిగా కరుణానిధి ప్రసంగించారన్నారు. ఇందిరావిన్‌ మరుమగలే వరుగ.. ఇండియావిన్‌ తిరుమగలే వెల్గ (ఇందిర కోడలా రావమ్మా.. భారత నారీ జయం నీకే) అని ఆహ్వానించారని గుర్తుచేశారు.  ఇప్పుడు ఆయన వారసుడిగా తమిళనాడు నుంచి ప్రధాని పదవికి రాహుల్‌ పేరును ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. ‘రాహుల్‌ రావాలి.. దేశంలో సుపరిపాలన రావాలి’ అన్న నినాదంతో ప్రతిజ్ఞ చేశారు. అలాగే, మోదీ పాలనకు చరమ గీతం పాడేలా అందరం రాహుల్‌కు మద్దతుగా నిలుద్దామని పిలుపునిచ్చారు. విగ్రహావిష్కరణ అనంతరం మెరీనా తీరంలో అన్నాదురై, కరుణానిధి సమా«ధుల వద్ద సోనియా, రాహుల్‌ నివాళులర్పించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top