రెండేళ్లా.? నాలుగేళ్లా..?

Singareny Identity Society Timing Clarifications - Sakshi

సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందేహం  

రెండేళ్లుగా నిర్ణయిస్తూ లేఖ రాసిన కేంద్ర కార్మిక శాఖ

నాలుగేళ్లు కొనసాగించాలని పేర్కొంటున్న టీబీజీకేఎస్‌  

ఇదే విషయమై డైరెక్టర్‌(పా) లేఖ రాసినా ప్రతిస్పందన కరువు  

గోదావరిఖని(పెద్దపల్లిజిల్లా): సింగరేణిలో ఆరో దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు 2017 అక్టోబర్‌ 5న జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 11 డివిజన్లకు తొమ్మిది డివిజన్లలో టీబీజీకేఎస్‌ గెలిచి గుర్తింపు సంఘంగా, రెండు డివిజన్లలో ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ గెలిచి ప్రాతినిధ్య సంఘంగా మారాయి.  

గుర్తింపు పత్రాలు ఇవ్వడంలో జాప్యం
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలను కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని సెంట్రల్‌ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయ వర్గాల ఆధ్వర్యంలో నిర్వహించారు. 2017 అక్టోబర్‌ 5న ఎన్నికలు జరిగి అదే రోజు రాత్రి ఫలితాలు వెల్లడించింది. కానీ అధికారిక పత్రాలను మాత్రం కార్మిక శాఖ అధికారులు ఇవ్వలేదు. ఈ విషయమై గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు చెందిన నాయకత్వం ఇటు యాజమాన్యంపైన, అటు కేంద్ర కార్మిక శాఖ అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చాయి. గుర్తింపు పత్రం ఇవ్వకపోవడంతో టీబీజీకేఎస్‌ను యాజమాన్యం అధికారికంగా ఏ సమావేశానికీ ఆహ్వానించలేదు. చివరకు ఎన్నికలు జరిగిన ఆరు నెలల తర్వాత కార్మిక సంఘాలకు 2018 ఏప్రిల్‌ 11న గుర్తింపు, ప్రాతినిధ్య హోదా పత్రాలను డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ రెండు సంఘాల నేతలకు అప్పగించారు.

ఆలస్యానికి బాధ్యులెవరు?
టీబీజీకేఎస్, ఏఐటీయూసీ సంఘాలకు గుర్తింపు, ప్రాతినిధ్య హోదా సర్టి ఫికెట్లు ఇవ్వడంలో ఆలస్యానికి బాధ్యులెవరనేది ప్రశ్నగా మారింది. సింగరేణిలో ఎన్నికలు 2017 అక్టోబర్‌ 5న జరగగా, కేంద్ర కార్మిక శాఖ నవంబర్‌ 30న గుర్తింపు, ప్రాతినిధ్య హోదా సర్టిఫికెట్లను సింగరేణి యాజమాన్యానికి పంపించింది. ఇందులో రెండేళ్ల కాలపరిమితిని నిర్ణయిస్తూ లేఖ పంపించారు. ఈ విషయంపై సింగరేణి యాజమాన్యం స్పందించి గతంలో గుర్తింపు సంఘం కాలపరిమితి నాలుగేళ్ల పాటు ఉండగా, ఈ సారి రెండేళ్లుగా నిర్ణయించడంపై డైరెక్టర్‌ (పా) కేంద్ర కార్మిక శాఖకు లేఖ రాశారు. గుర్తింపు సంఘం కాలపరిమితి నాలుగేళ్లు ఉండేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్ర కార్మిక శాఖ నుంచి ఇందుకు స్పందన రాలేదు. గుర్తింపు, ప్రాతినిధ్య హోదా సర్టిఫికెట్లు సింగరేణికి 2017 నవంబర్‌ 30నే వచ్చినా యాజమాన్యం మాత్రం వాటిని గెలిచిన సంఘాలకు ఇవ్వకుండా నాన్చుతూ వచ్చింది. చివరకు మూడు నెలల తర్వాత రెండేళ్ల కాలపరిమితి అంటూ కార్మిక శాఖ నుంచి లేఖ పంపించారు. దీంతో చేసేదేమీలేక ఆనాడు పంపించిన పత్రాలనే గత బుధవారం హైదరాబాద్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో టీబీజీకేఎస్, ఏఐటీయూసీ నేతలకు వాటిని అందజేశారు. సింగరేణి యాజమాన్యమా? లేక కేంద్ర కార్మిక శాఖా? ఈ ఆలస్యానికి బాధ్యులెవరనేది ప్రశ్నార్థకంగా మారింది.  

తొలుత రెండేళ్లు..అనంతరం నాలుగేళ్లు.. ఇప్పుడు.?
1998లో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభం కాగా ఆ సంవత్సరంతో పాటు 2001లో రెండేళ్ల కాలపరిమితి నిర్ణయించారు. 2003 నుంచి నాలుగేళ్ల పరిమితి వర్తింపజేశారు. 2007, 2012లో గెలిచిన సంఘాలకే అదే కాలపరిమితి వర్తింపజేశారు. 2017లో తిరిగి రెండేళ్ల కాలపరిమితి అంటూ కేంద్ర కార్మిక శాఖ పాతపాటే పాడింది.  

 ఎప్పటి నుంచి అమలు.?
ఈ సారి రెండేళ్ల కాలపరిమితి నిర్ణయించిన నేపథ్యంలో అది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే చర్చ సాగుతోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమకు అధికారిక పత్రం ఇచ్చినప్పటి నుంచే కాలపరిమితి అమల్లోకి వస్తుందని గుర్తింపు సంఘం నాయకులు పేర్కొంటున్నారు. కానీ కేంద్ర కార్మిక శాఖ 2017 నవంబర్‌ 30వ తేదీనే అధికారిక పత్రం ఇవ్వగా...దానిని టీబీజీకేఎస్, ఏఐటీయూసీ సంఘాలకు ఇవ్వడంలో సింగరేణి యాజమాన్యం తాత్సారం చేస్తూ వచ్చింది. కేంద్ర కార్మిక శాఖ మొదట అధికారిక పత్రాలను పంపించిన నవంబర్‌ 30వ తేది నుంచి కాలపరిమితి మొదలవుతుందని పలువురు పేర్కొంటున్నారు.

అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తాం
సింగరేణిలో ఆరో దఫా గుర్తింపు సంఘం ఎన్నికల జరగడానికి ముందు కాలపరిమితి రెండేళ్లా, నాలుగేళ్లా అనే విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ కార్మిక సంఘాలకు తెలపలేదు. గతంలో ఉన్నట్లుగానే నాలుగేళ్లు ఉంటుందని మాతో పాటు మెజారీ కార్మిక సంఘాలు నమ్మాయి. చివరకు టీబీజీకేఎస్‌ గెలిచిన తర్వాత నాలుగేళ్లు కాదు, రెండేళ్ల కాలపరిమితి అంటూ లేఖ రాయడం కేంద్ర కార్మిక శాఖకు సరికాదు. ఈ విషయంలో అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తాం.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top