నేను దొరనా? మాది మైనారిటీ కులం : కేసీఆర్‌

singareni election result : cm kcr slams opposition - Sakshi

తెలంగాణలో ఇప్పుడున్న ఒకే ఒక్క దొర ఉత్తమ్‌ కుమారే

సింగరేణి కార్మికుల తీర్పు చరిత్రాత్మకమన్న ముఖ్యమంత్రి

సింగరేణి ఎన్నికల్లో టీజీబీకేఎస్‌ గెలుపుపై హర్షం.. హామీలను నెరవేరుస్తామని ప్రకటన

సోషల్‌ మీడియాలో వ్యతిరేక ప్రచారంపై మండిపడ్డ సీఎం

రాష్ట్రంలో వెలమలది మైనారిటీ కమ్యూనిటీ.. జనాభాలో 1.1 శాతమే!

హైదరాబాద్‌ : సింగరేణి సంస్థ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ టీజీబీకేఎస్‌ భారీ విజయాన్ని సాధించడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్రాత్మక విజయమని, తమపై నమ్మకం ఉంచిన కార్మికులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. సింగరేణి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నీచ ప్రయత్నాలను కార్మికులు తిప్పికొట్టారని, వరుస పరాజయాలు ఎదురైనా ప్రతిపక్షాలకు బుద్ధిరావడం లేదని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సీఎం మీడియాతో మాట్లాడారు.

‘తెలంగాణ బాగు కోసం నిరంతరం కష్టపడుతోన్నది ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీనే. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిన మాపై అవాస్తవాలు ప్రచారం చేయడం దారుణం. భూముల సర్వేలాంటి మంచి పనిని సైతం వ్యతిరేకిస్తున్నారంటేనే ప్రతిపక్షాల బుద్ధి ఏమిటో అర్థమవుతుంది. రైతు సమితులపైనా దుష్ప్రచారం చేస్తున్నరు.  దానివల్ల స్థానిక సంస్థల ప్రతిపత్తి దెబ్బతింటుందని అర్థంలేని మాటలు మాట్లాడుతున్నరు. ఎవరు ఎన్ని పొడబొబ్బలు పెట్టినా మేం ముందుకే వెళతాం. సింగరేణి ఎన్నికల్లో జాతీయ నాయకులు వచ్చి ప్రచారం చేసినా మా విజయాన్ని అడ్డుకోలేకపోయారు.’ అని కేసీఆర్‌ అన్నారు.

నేను దొరనా? : అద్భుతంగా పనిచేస్తోన్న తమ ప్రభుత్వంపై ఇటీవల దుష్ప్రచారం పెరిగిపోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాపోయారు. ‘సింగరేణి ఎన్నికల సందర్భంలో వారసత్వ ఉద్యోగాల పేరుతో కొంత మంది యువకులు ముఖ్యమంత్రి, మంత్రులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ప్రతిపక్షనేతలు కూడా నోటికొచ్చిన కూతలు కూస్తున్నారు. వాళ్లు ఏమంటున్నారు.. నేను దొరనా? దొర అంటే ఎవరో తెలుసా? మా ఇల్లు గడీ లెక్క ఉంటదా? అసలు తెలంగాణలో ఇయ్యాల దొర ఎవరైన ఉన్నరంటే అది ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక్కరే. ఆయన ఇల్లు పెద్ద గడీ. నిజానికి మా కులం ఇక్కడ మైనారిటీ కమ్యూనిటీ. తెలంగాణ జనాభలో కేవలం 1.1 శాతం మాత్రమే మా కులస్తులు ఉన్నరు’ అని సీఎం చెప్పుకొచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top