మధ్యప్రదేశ్‌ సీఎంకు బావమరిది ఝలక్‌

Shivraj Singh Chouhan's Brother-In-Law Joins Madhya Pradesh Congress party - Sakshi

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు ఆయన సొంత బావమరిదే షాక్‌ ఇచ్చారు. బీజేపీకి చెందిన సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ భార్య సాధనా సింగ్‌కు స్వయానా సోదరుడైన సంజయ్‌ సింగ్‌ మసానీ శనివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కమల్‌నాథ్, సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మధ్యప్రదేశ్‌కు శివరాజ్‌ అవసరం లేదు. కమల్‌నాథ్‌లాంటి నేత కావాలి. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు.

నన్ను ముఖ్యమంత్రి కుటుంబసభ్యుడిగా కాకుండా కేవలం బంధువుగా మాత్రమే చూడండి’ అని అన్నారు. కమల్‌ నాథ్‌ మాట్లాడుతూ.. ‘బీజేపీ, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పాలనతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. మసానీ కాంగ్రెస్‌లో చేరడం కూడా ప్రజల అభీష్టానికి అద్దం పడుతోంది’ అని అన్నారు. దాదాపు ఇలాంటి పరిణామమే 2003 ఎన్నికలకు ముందు చోటుచేసుకోవడం గమనార్హం. అప్పటి సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ సోదరుడు అర్జున్‌సింగ్‌ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలుకాగా, అప్పుడు  బీజేపీ అధికారంలోకి వచ్చింది.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top