రాహుల్‌ వ్యాఖ్యలపై శివసేన కౌంటర్‌

Shiv Sena leader Eknath Shinde Respond On Rahul Comments Over Savarkar - Sakshi

సావార్కర్‌ను అందరూ గౌరవించాల్సిందే: ఏక్‌నాథ్‌ షిండే

సావార్కర్‌ అమరుడు: రౌత్‌

రాహుల్‌ వ్యాఖ్యలపై దుమారం

సాక్షి, ముంబై: వీర్‌ సావార్కర్‌పై కాంగ్రెస్‌ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్‌ భాగస్వామ్యంగా ఉండటంతో తన ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తం చేయలేకపోతోంది. అయితే సందర్భం దొరికితే మాత్రం.. ఏమాత్రం ఆలోచన చేయకుండా రాహుల్‌ వ్యాఖ్యలను ఖండిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ రాహుల్‌ వ్యాఖ్యలను ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ కీలక నేత, రాష్ట్రమంత్రి ఏక్‌నాథ్‌ షిండే రాహుల్‌ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. దేశంలో ప్రతిఒక్కరూ వీర్‌ సావార్కర్‌ను గౌరవించాల్సిందేనని అన్నారు. జాతి నిర్మాణంలో ఆయన పాత్రను ఏ ఒక్కరూ ప్రశ్నించడానికి వీల్లేదని రాహుల్‌ను ఉద్దేశించి చురకలు అంటించారు. (రాహుల్‌పై పరువునష్టం దావా!)

హిందుత్వ సిద్ధాంతాల విషయంలో తమ పార్టీ రాజీపడే ప్రసక్తే లేదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఇదివరకే స్పష్టం చేశారు. ‘వీర్‌ సావర్కర్‌ మహారాష్ట్రకు మాత్రమే కాదు.. దేశం మొత్తానికి ఆదర్శనీయమైన వ్యక్తి. నెహ్రూ, గాంధీలకు లాగానే సావర్కర్‌ కూడా దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు. అలాంటి వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’అని ట్వీట్‌ చేశారు. కాగా ‘నా పేరు రాహుల్‌ గాంధీ. రాహుల్‌ సావర్కర్‌ కాదు. నేను నిజమే మాట్లాడాను. చావనైనా చస్తాను కానీ క్షమాపణ మాత్రం చెప్పను’అని రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాహుల్‌ వ్యాఖ్యలు మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో చిచ్చుపెట్టేలా ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హిందుత్వ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ ద్వంద వైఖరి అవలంభిస్తోందంటూ బీఎస్పీ చీఫ్‌ మాయావతి ఇదివరకే పేర్కొన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో శివసేనతో జట్టుకట్టి.. మరోవైపు సావార్కర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. (నా పేరు రాహుల్‌ సావర్కర్‌ కాదు)

దీనిపై వీర్‌ సావార్కర్‌ మనవడు రంజిత్‌ సావార్కర్‌ మరింత ఘాటుగా స్పందించారు. రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తానని ఆయన తెలిపారు. అలాగే దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో కూడా చర్చిస్తానని ఆయన పేర్కొన్నారు. రాహుల్‌ వ్యాఖ్యలను ఖండించాలని ఠాక్రేను కోరనున్నట్లు ఆయన ప్రకటించారు. శివసేన హిందుత్వ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని, కాంగ్రెస్‌తో స్నేహానికి ముగింపు పలకాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఠాక్రే మంత్రివర్గంలోని కాంగ్రెస్‌ మంత్రులను వెంటనే తొలగించాలని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top