కరోనా : రాజకీయ సంక్షోభం తప్పదా..!

Sharad Pawar Meeting With Uddhav Thackeray After BJP Allegations - Sakshi

సాక్షి, మహారాష్ట్ర : దేశ వ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రజలు కరోనాతో అల్లాడుతున్నా ఇవేవీ పట్టని నేతలు రాజకీయ విమర్శలకు దిగుతూ అధికార పీఠం కోసం పావులు కదుపుతున్నారు. కరోనా వైరస్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద హాట్‌స్పాట్‌ కేంద్రంగా మారుతున్న ముంబై మహానగరం ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎసరుపెట్టేలా ఉంది. సిద్ధాంత వైరుధ్యం గల శివసేన-కాంగ్రెస్‌-ఎన్సీపీలు జట్టుకట్టడం ఏమాత్రం జీర్ణించుకులేకపోతున్న ప్రతిపక్ష బీజేపీ.. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇ‍ప్పటికే ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. (మహారాష్ట్రలో అనూహ్యం)

రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌..
మహారాష్ట్రలో మొత్తం కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇప్పటికే 50వేలు దాటగా.. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోనే సగానికి పైగా కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. వైరస్‌ కట్టడికి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసులు ఏమాత్రం అదుపులోకి రావడంలేదు. మరోవైపు పౌరులు ప్రాణాలు కోల్పోవడం మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ విమర్శలకు మరింత పదునుపెట్టింది. వైరస్‌ కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తీవ్రంగా విఫలమయ్యారని విమర్శిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ నారాయణ్‌ రాణే గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీతో భేటీ కావడం, రాష్ట్రంలో పరిస్థితి అదుపులోదని రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బీజేపీ ఉద్ధేశ పూర్వకంగానే  గవర్నర్‌తో మంతనాలు చేస్తోందని తెలుస్తోంది. (మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌)

ఇక ఉద్ధవ్‌ నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్‌లో మంత్రులు, నేతల మధ్య  విభేదాలు ఉన్నాయని ప్రతిపక్షం ప్రచారం చేస్తోంది. వైరస్‌ వ్యాప్తి ఒకవైపు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరోవైపు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. లాక్‌డౌన్‌ ఎత్తివేతపై ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే భినాభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే లాక్‌డౌన్‌ను ఎత్తివేయక తప్పదని పవార్‌ సూచించగా.. వైరస్‌ను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌ఒక్కటే  మార్గమని ఠాక్రే స్పష్టం చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతల ఒత్తిడి మేరకే ఆంక్షల్లో సడలింపు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర..
మరోవైపు ప్రభుత్వంలో అసంతృప్తిని పసిగట్టిన బీజేపీ నేతలు సర్కార్‌కు పడేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో శరద్‌ పవార్‌ మంగళవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైరస్‌ కట్టడి ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. భేటీ అనంతరం పవర్‌ మీడియా మాట్లాడుతూ.. పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ తమ ప్రభుత్వం స్థిరంగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై కేంద్ర హోమంత్రి అమిత్‌ షా కూడా ఆరా తీసినట్లు సమాచారం. మొత్తానికి కరోనా కష్ట కాలంలోనూ మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top