అమిత్‌ షా అజెండా ఏంటో మాకు తెలుసు..!

Sanjay Raut Says Shiv Sena Will Contest All Upcoming Elections On Its Own - Sakshi

ముంబై : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే మిత్రపక్షం శివసేన పార్టీతో కలిసి పోటీ చేయాలనుకున్న బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాల్ఘడ్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో మిత్రపక్షంతో ఏర్పడిన విభేదాలు తారస్థాయికి చేరడంతో.. పరిస్థితులను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన అమిత్‌ షా వ్యూహం బెడిసికొట్టింది. ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ ప్రచారంలో భాగంగా అమిత్ షా శివసేన ఉద్ధవ్‌ ఠాక్రేతో సమావేశమైన అనంతరం.. ఆ పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ మీడియాతో మాట్లాడారు. ‘అమిత్‌ షా అజెండా ఏమిటో మాకు తెలుసు. కానీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న శివసేన నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండబోదంటూ’ సంజయ్‌ వ్యాఖ్యానించారు.

అమిత్‌ షాతో సమావేశానికి ముందే.. ‘2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని’ శివసేన తమ పార్టీ పత్రిక సామ్నాలో ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అమిత్‌ షా తన చాకచక్యంతో మిత్రపక్షంతో సయోధ్య కుదుర్చుకునే తీరతారంటూ బీజేపీ వర్గాలు విశ్వసించాయి. కానీ సంజయ్‌ రౌత్‌ మాటలతో ఇక శివసేనతో పొత్తు విషయం అటకెక్కినట్లేనని వారు భావిస్తున్నారు.

కాగా, సంపర్క్‌ ఫర్‌ సమర్థన్‌ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా బుధవారం ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. పారిశ్రామిక వేత్త రతన్‌ టాటాతో పాటు హీరోయిన్‌ మాధురీ దీక్షిత్‌ను కూడా అమిత్‌ షా కలిశారు. సిద్ధివినాయక గుడిని సందర్శించిన అనంతరం ఉద్ధవ్‌ ఠాక్రేతో సమావేశమైన అమిత్‌ షా.. వచ్చే ఎన్నికల్లో పొత్తు విషయమై చర్చించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top