ఎమ్మెల్సీ సోదరుని ఇసుక దందా | Sand Mafia of Jogireddy | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ సోదరుని ఇసుక దందా

Dec 26 2018 4:31 AM | Updated on Dec 26 2018 10:38 AM

Sand Mafia of Jogireddy - Sakshi

అనంతపురం సెంట్రల్‌: అధికార దర్పంతో టీడీపీ నేతలు నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇసుకను తోడేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా వారికి కాసుల వర్షం కురిపిస్తోంది. తమ పలుకుబడితో ఇసుక రీచ్‌ల పేరిట ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకుని, నిబంధనలకు విరుద్ధంగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి) సోదరుడు జోగిరెడ్డి అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలోని లింగారెడ్డిపల్లికి చెందిన రైతులు రంగనాయకులు, కుళ్లాయప్ప పొలాల నుంచి ఇసుక తరలించేందుకు వారి పేరిట ఇసుక రీచ్‌ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసి అనుమతులు దక్కించుకున్నారు. అయితే అనుమతులలో సూచించిన నిబంధనలను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా భారీ యంత్రాలతో లోతైన గుంతలను తవ్వి ఇసుకను అక్రమంగా తరలిసున్నారు. టీడీపీ నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నప్పటికీ ఆ రీచ్‌ల వైపు ఏ అధికారీ కన్నెత్తి చూడటంలేదు.

అధికారులు రీచ్‌కు ఇచ్చిన అనుమతులు ఇలా..
లింగారెడ్డిపల్లికి చెందిన రైతులు కుళ్లాయప్ప, రంగనాయకులుకు మల్లాగుండ్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని 114–2, 112–1,9  సర్వే నంబర్లలో 6.75 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో ఇసుక దిబ్బలు ఎక్కువగా ఉండటంతో ఇసుక తరలింపునకు రీచ్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు భూమి స్థితిగతులను పరిశీలించి 2.09 ఎకరాల్లో మాత్రమే ఇసుక దిబ్బలున్నాయని గుర్తించారు. ఇసుక దిబ్బలున్న ప్రాంతంలో 6 మీటర్ల లోతు వరకు మొత్తం 50,750 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తవ్వుకోవచ్చని అధికారులు సూచించారు.

నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు
ఇసుక దిబ్బలు ఉన్న ప్రాంతంలో 6 మీటర్ల వరకే తవ్వుకోవాలని అధికారులు సూచించగా, టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డు పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా పొలంలో 30 అడుగుల మేరకు గుంతలను (9.5 మీటర్లు) తవ్వుతూ ఇసుక తరలిస్తున్నారు. రీచ్‌కు అనుమతులిచ్చిన భూమిలో కాకుండా చిత్రావతి నదికి, అనుమతులు వచ్చిన పొలాల మధ్య ఉన్న బంజరు భూమిలోనూ తవ్వకాలు చేపడుతున్నారు. వర్షం వస్తే మిగతా భూమిలో కోతలు ఏర్పడతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటకకు తరలింపు?
యల్లనూరు మండలంలో నిబధనలకు విరుద్ధంగా రీచ్‌ నుంచి రోజూ దాదాపు 50 నుంచి 60 లారీల (టెన్‌ వీలర్‌) ఇసుకను తవ్వుతున్నారు. ఇలా సుమారు 1,000 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను కర్ణాటకలోని బెంగళూరు సిటీకి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. ఒక్కో లారీ ఇసుక ధర రూ.50 వేలు పలుకుతోంది.

అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు
రీచ్‌లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుకను తరలించాల్సి ఉంది. అలా కాదని నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వాహనాలను సీజ్‌ చేస్తాం.
– రమాదేవి,తహసీల్దార్, యల్లనూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement