​​‘కేసీఆర్‌ ఆవేదన సభ అని పెట్టుకోండి’

Revanth Reddy Fires On KTR Over Pre Poll Elections - Sakshi

ఎన్నికల సామాగ్రి డబ్బాల్లో ఇవ్వరు.. గోనె సంచీల్లో ఇస్తారు

ఎంపీ సంతోష్‌ రావే డబ్బాల్లో డబ్బుల పంచారు

కేటీఆర్‌ సభ ఇంచార్జి కాబట్టి సమాధానం చెప్పాలి

కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించబోయే ప్రగతి నివేధన సభకు కేసీఆర్‌ ఆవేదన సభ అని పేరు పెట్టుకోవాలని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ప్రతిపక్షపార్టీగా సీఎం కేసీఆర్‌కు కొన్ని ప్రశ్నలు వేసామని, తమ కోసం కాకపోయినా ప్రజల కోసమైనా వాటికి సమాధానం చెప్పాలన్నారు. ముందస్తు ఎన్నికలు రావడం వల్ల ఎవరికి లాభమని ప్రశ్నించారు. మీ బాస్‌లు ప్రజలే అయితే.. వారు 5 ఏళ్ల కోసం ఓట్లేశారని, కానీ 4 ఏళ్ల 4నెలలకే ఎన్నికలు ఎందుకు పోతున్నారని నిలదీశారు. 133 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని ఎన్నికలు చూసి ఉంటుందని, ముందస్తు అంటే తమకేం భయమని.. ఇది టీఆర్‌ఎస్‌ నేతల అవగాహనరాహిత్యం అన్నారు. ప్రతిపక్షంగా ప్రజల పట్ల బాధ్యత ఉంది కాబట్టి, మీరు భయపడి ముందస్తుకు పోతున్నారు కాబట్టి అడుగుతున్నామని స్పష్టం చేశారు.

కేసీఆర్‌..ఆ అవసరం ఏంటి..
జనవరి4, 2019 కల్లా కొత్త ఓటర్‌ లిస్ట్‌ పెట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని, ముందస్తు జరగాలంటే ఆ కార్యచరణ మొత్తం పక్కన పెట్టి పాత లిస్ట్‌తో ఎన్నికలకు వెళ్లాలని, ఆ అవసరం ఏముందని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ముందు కేసీఆర్‌ మొకారిల్లుతున్నాడని మండిపడ్డారు. విభజన హామీల కోసం కేసీఆర్‌ ఎన్నడూ కేంద్ర మంత్రులను, ప్రధానిని కలవలేదని, కానీ ముందస్తు కోసం కేటీఆర్‌, కేసీఆర్‌ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వంగి, వంగి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. వారు చేయించుకున్న సర్వేలో ఎక్కడా ఎమ్మెల్యేగా కూడా గెలుస్తారని రాలేదని, అందుకే మందుస్తుకు సిద్దమయ్యారని తెలిపారు. ముందస్తు వల్ల ఎన్నికల కోడ్‌ అమలవుతుందని, దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు.

వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ ఏమైంది?
ఒకే దేశం, ఒకే ఎన్నికలను అని పిలుపునిచ్చిన బీజేపీ.. ఎందుకు తెలంగాణలో ముందస్తుకు సహకరిస్తుందో సమాధానం చెప్పాలన్నారు. 1989లో దివంగత నేత ఎన్టీఆర్‌, 2004లో చంద్రబాబు నాయుడులకు ముందస్తు ఫలితాలు ఎలా వచ్చాయో.. కేసీఆర్‌ పరిస్థితి కూడా అంతేనని రేవంత్‌ జోస్యం చెప్పారు. కొంగర ఖలాన్‌లో ప్రగతి నివేదన సభకు 25 లక్షల మందితో సభ పెడితే రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని, వాటి వివరాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సభ కోసమే తెలంగాణ భవన్‌లో  ఎమ్మెల్యేలకు  కోటిరూపాయల డబ్బా ఇచ్చారని, ఎమ్మెల్యేలు ఎగబడి తీసుకున్నారని ఆరోపించారు. ఇది ఎంపీ సంతోష్‌రావు చేశారని తమకు పక్కా సమాచారం ఉందన్నారు. 

కేటీఆర్‌ అమెరికాలో బాత్రూమ్‌లు కడిగినప్పుడే తను ఎన్నికలకు పోటీచేశానన్నారు. ఎన్నికల సామాగ్రి డబ్బాల్లో ఇవ్వరని, గోనె సంచీల్లో ఇస్తారని, కేటీఆర్‌ సభకు ఇంచార్జి కాబట్టి సమాధానం చెప్పాలన్నారు. ఆ డబ్బాల్లో ఎంత సామాగ్రి పడుతుందో చెప్పాలని నిలదీశారు. కేటీఆర్‌ను సీఎం చేయాలనుకుంటున్నారని, కానీ గాడిదకు కళ్లెం కడితే గుర్రం కాదని ఎద్దేవ చేశారు. తన మీద పెట్టిన కేసులపై కోర్టులు తీర్పునిచ్చాయన్నారు. తమ పార్టీ పొత్తులపై టీపీసీసీ అధ్యక్షుడు సమాధానం చెబుతారని రేవంత్‌ స్పష్టం చేశారు. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌  కాంగ్రెస్‌లో చేరుతానంటే మాట్లాడుతానన్నారు.

చదవండి: పెట్టెల్లో డబ్బు పంచుకోవడం ఆయనకే బాగా తెలుసు: కేటీఆర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top