
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రముఖ నటుడు రజనీకాంత్ ప్రకటించారు. అభిమానులు తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారనీ, వాటిని వమ్ముచేయబోనని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీచేస్తామన్నారు. రాష్ట్రంలో 38 లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాల్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.
రజనీకాంత్ కుడిచేతి వేలిపై సిరాచుక్క
చెన్నైలో పోలింగ్ సందర్భంగా ఓటేసిన రజనీకాంత్‌కు ఎడమచేతి చూపుడువేలిపై కాకుండా కుడిచేతి చూపుడు వేలిపై అధికారులు సిరాచుక్క పెట్టారు. నిబంధనల ప్రకారం.. ఎడమచేతి చూపుడు వేలిపై సిరా గుర్తు వేయాలి. కుదరకుంటే తర్వాతి వేలికి, లేదంటే ఆతర్వాతి వేలికి చుక్క పెట్టాలి. కానీ, ఎన్నికల అధికారి తప్పిదం చేశారని, అధికారిపై చర్యలు తీసుకుంటామని చీఫ్ ఎలక్టోరల్ అధికారి చెప్పారు.