ఏకకాల ఎన్నికలకు రజినీ మద్దతు

Rajinikanth backs simultaneous polls - Sakshi

సాక్షి, చెన్నై: లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న కేంద్రం ప్రతిపాదనకు ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్‌ మద్దతు తెలిపారు.అన్ని ఎన్నికలూ ఒకేసారి జరిగితే సమయం, ఖర్చు ఆదా అవుతాయని రజినీ అన్నారు. అలాగే 277 కి.మీ. పొడవైన, రూ.పదివేల కోట్లతో చేపట్టనున్న చెన్నై–సేలం 8 వరుసల రహదారి ప్రాజెక్టునూ ఆయన సమర్థించారు. ఈ ప్రాజెక్టు సాగు, అటవీ భూములకు చేటు అంటూ కొందరు వ్యతిరేకిస్తుండగా.. అభివృద్ధి జరగాలంటే ఇలాంటివి అవసరమేననీ, అయితే భూములు కోల్పోయే వారికి తగిన నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు.

బాలుడి దత్తత: పాఠశాలకు వెళ్తున్నప్పుడు రూ.50 వేలు డబ్బు దొరకగా నిజాయితీతో దానిని పోలీసులకు అప్పగించిన ఏడేళ్ల బాలుడు మహ్మద్‌ యాసిన్‌ను దత్తత తీసుకుంటానని రజినీ ప్రకటించారు. ఈరోడ్‌కు చెందిన యాసిన్‌తోపాటు, అతని తల్లిదండ్రుల్ని రజినీకాంత్‌ తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. బాలుడికి బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చిన ఆయన.. ఆ పిల్లాడి ఉన్నత విద్యకయ్యే ఖర్చునంతా తానే భరిస్తానని చెప్పారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top