ప్రతి కుటుంబానికి 72వేలు

Rahul Gandhi promises minimum income scheme - Sakshi

కనీస ఆదాయ భద్రత పథకం విధివిధానాలు ప్రకటించిన కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ

నెలకు రూ.12 వేలలోపు ఆదాయమున్న కుటుంబాలకు లబ్ధి

కటాఫ్, ఆదాయానికి మధ్య వ్యత్యాసం చెల్లింపు

ఒకవేళ రూ.7,000 ఆదాయముంటే మిగతా రూ.5,000 అందజేత

పథకం పరిధిలోకి రానున్న 25 కోట్ల మంది నిరుపేదలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ భద్రత పథకాన్ని అమలుచేస్తామన్న రాహుల్‌.. సోమవారం ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను ప్రకటించారు. కనీస ఆదాయ భద్రత పథకంలో భాగంగా దేశంలో అత్యంత నిరుపేదలైన 20 శాతం కుటుంబాలకు ఏటా రూ.72,000 అందజేస్తామని రాహుల్‌ తెలిపారు. దేశంలోని ఐదు కోట్ల కుటుంబాలు, 25 కోట్ల మంది ప్రజలు ఈ పథకం ద్వారా ప్రత్యక్షంగా లబ్ధిపొందుతారని వెల్లడించారు.. కనీస ఆదాయ భద్రత పథకం ద్వారా దేశంలోని పేదరికంపై విజయం సాధిస్తామని రాహుల్‌ అన్నారు.

ఆర్థికవేత్తలు, నిపుణులతో చర్చలు
సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టో రూపకల్పనపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో చర్చించిన అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ..‘పలువురు ప్రముఖ ఆర్థికవేత్తలు, నిపుణులతో ఇప్పటికే చర్చించాం. అనుభవాలు, అభిప్రాయాలకు అనుగుణంగా 5 నెలల పాటు అధ్యయనం చేసి కనీస ఆదాయ భద్రత పథకాన్ని రూపొందించాం. ఇలాంటి చారిత్రాత్మక పథకం ప్రపంచంలో ఇప్పటివరకూ ఎక్కడా రూపుదిద్దుకోలేదు. పేదలకు న్యాయం జరుగుతుంది’ అని తెలిపారు.

కావాల్సినంత నిధులు ఉన్నాయి
‘మేం పేదలకు న్యాయం చేయబోతున్నాం. దేశంలో ధనిక, పేద భారత్‌లను ప్రధాని మోదీ సృష్టిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్‌ ఎన్నటికీ జరగనివ్వదు. భారత్‌ ఎప్పుడూ ఐక్యంగా ఉంటుంది. ప్రధాని ధనికులకు నగదును దోచిపెడితే, కాంగ్రెస్‌ పార్టీ పేదలకు నగదును అందజేస్తుంది’ అని తెలిపారు. కనీస ఆదాయ భద్రత పథకం అమలు చేసేందుకు కేంద్రం వద్ద తగిన నిధులు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ఆర్థిక క్రమశిక్షణకు ముప్పు..
కాంగ్రెస్‌ ప్రకటించిన కనీస ఆదాయ భద్రత పథకంపై నీతి ఆయోగ్‌ పెదవి విరిచింది. ఈ పథకం వల్ల దేశంలో ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందని నీతిఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ హెచ్చరించారు. ‘స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 2 శాతం, ఏటా బడ్జెట్‌లో 13 శాతం నిధులను దీనికోసమే కేటాయించాల్సి ఉంటుంది. ఈ పథకం వల్ల ప్రజల వాస్తవ అవసరాలు మరుగున పడతాయి. ఇలాంటి పథకాలను అమలుచేయడం ఆచరణసాధ్యం కాదు. ఎన్నికల్లో గెలిచేందుకు గతంలో ఇచ్చిన పెద్దపెద్ద హామీల తరహాలోనే కాంగ్రెస్‌ కనీస ఆదాయ భద్రత పథకాన్ని ప్రకటించింది.

1971లో పేదరికాన్ని తరిమేద్దాం(గరీబీ హటావో), 2008లో ఒకే ర్యాంక్‌–ఒకే పెన్షన్, 2013లో జాతీయ ఆహారభద్రత బిల్లు విషయంలో కాంగ్రెస్‌ హామీలు ఇచ్చినప్పటికీ వాటిని నిలబెట్టుకోలేదు. కనీస ఆదాయ పథకానికి కూడా ఇదే గతి పడుతుంది’ అని కుమార్‌ స్పష్టం చేశారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి(ఈఏసీ–పీఎం) స్పందిస్తూ.. ‘దేశ ఆర్థికవృద్ధి, ద్రవ్యోల్బణం, ఆర్థిక క్రమశిక్షణ మధ్య సమతౌల్యత కోసం నిపుణులు చాలా కష్టపడ్డారు. కానీ కాంగ్రెస్‌ ప్రకటించిన కనీస ఆదాయ భద్రత పథకం వల్ల ఈ సమతౌల్యత దెబ్బతింటుంది’ అని ట్వీట్లు చేసింది. ఈ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాయని నెటిజన్లు గుర్తుచేయడంతో ఈఏసీ–పీఏం సదరు ట్వీట్లను తొలగించింది.  

ఎలా అమలు చేస్తామంటే?
నెలకు రూ.12 వేలలోపు కుటుంబ ఆదాయాన్ని కనీస ఆదాయ భద్రత పథకానికి కటాఫ్‌గా నిర్ణయించామని రాహుల్‌ గాంధీ వెల్లడించారు. ‘నెలకు రూ.12,000, అంతకన్నా తక్కువగా ఆర్జించే కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబ ఆదాయానికి, కటాఫ్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేస్తుంది. ఉదాహరణకు ఓ కుటుంబం నెలకు రూ.7,000 ఆదాయం పొందితే మిగతా రూ.5 వేలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది’ అని రాహుల్‌ పేర్కొన్నారు.

ఇలా ఒక్కో కుటుంబానికి రూ.72 వేల వరకూ అందిస్తామని పునరుద్ఘాటించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కనీస ఆదాయ పథకమన్న రాహుల్‌.. దీన్ని దశలవారీగా అమలుచేస్తామని ప్రకటించారు. తొలుత పైలెట్‌ ప్రాజెక్టును ప్రారంభించి, ఆ తర్వాత దేశమంతా విస్తరింపజేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినవెంటనే అత్యంత నిరుపేదలైన 20 శాతం కుటుంబాలను ఎంపిక చేస్తామని రాహుల్‌ గాంధీ చెప్పారు. దేశంలోని ప్రతీ నిరుపేదకు కనీస ఆదాయం కల్పించేందుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

పేదలు ఈసారి మోసపోరు
కాంగ్రెస్‌ కనీస ఆదాయ పథకంపై బీజేపీ  నేత అరుణ్‌ జైట్లీ విమర్శలు గుప్పించారు. ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.72 వేలు అంటూ కాంగ్రెస్‌ అబద్ధాలు చెబుతోందన్నారు. ‘నినాదాలు, వాగ్దానాలు పేదరికాన్ని తొలగించలేవు. అందుకు మా సర్కార్‌లా ఇళ్ల నిర్మాణం, గ్యాస్‌ కనెక్షన్లు, రోడ్లు, ఆసుపత్రులు, ఇతర మౌలికవసతులను కల్పించాల్సి ఉంటుంది.  కనీస ఆదాయ పథకం కోసం కేంద్రం రూ.3.6 లక్షల కోట్లను వెచ్చించాల్సి ఉంటుంది.


కానీ మోదీ ప్రభుత్వం పేదల కోసం ఇప్పటికే రూ.5.34 లక్షల కోట్లు ఖర్చుపెట్టింది. ప్రస్తుత దేశంలోని అత్యంత నిరుపేదలైన 20 శాతం కుటుంబాలకు వేర్వేరు పథకాల ద్వారా కేంద్రం ఏటా రూ.1.06 లక్షలను అందజేస్తోంది. అలాంటప్పుడు రాహుల్‌ అందిస్తామని చెబుతున్న రూ.72 వేలతో ప్రయోజనం ఏంటి?’ అని అరుణ్‌ జైట్లీ ప్రశ్నించారు. దేశంలోని నిరుపేదలు ఇప్పటికే చాలాసార్లు కాంగ్రెస్‌ చేతిలో మోసపోయారనీ, కానీ ఈసారి ఆ ఉచ్చులో పడబోరని వ్యాఖ్యానించారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top