కాంగ్రెస్‌ ముఖ్యులతో ముగిసిన రాహుల్‌గాంధీ సమావేశం

Rahul Gandhi Meeting With Congress Leaders In Delhi - Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్‌ వార్‌ రూంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిర్వహించిన కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ లీడర్లతో పాటు ముఖ్య నేతలు అశోక్‌ గెహ్లాట్‌, గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మతో సహా కీలక నేతలు హాజరయ్యారు.  రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, కేరళ ప్రజలను ఆదుకోవడంపై కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ గాంధీ దిశానిర్దేశం చేశారు. సమావేశానికి హాజరైన ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి సమావేశం అనంతరం మాట్లాడుతూ..రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోళ్లలో జరిగిన అవినీతి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రఫెల్‌ కుంభకోణంలో మోదీ పెద్ద దోషి అని, ఆయనే ప్రధాన దోపిడీదారుడని విమర్శించారు.

రూ.500 కోట్ల విలువ చేసే విమానాలను రూ.1600 కోట్లకు కొనుగోలు చేశారని ఆరోపించారు. ప్రజా ధనాన్ని మోదీ దోచుకున్నారని, రిలయన్స్‌ కంపెనీకి డబ్బును దోచిపెట్టారని ఆరోపణలు గుప్పించారు. దేశ రక్షణను పణంగా పెట్టారని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌ రఫెల్‌ కుంభకోణాన్ని బయటపెట్టినా ప్రధాని మాట్లాడటం లేదు..రఫెల్‌ కుంభకోణంపై విచారణకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.

బీజేపీ అవినీతిని ఏవిధంగా బయటపెట్టాలో కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు.  ఏపీలో జిల్లా స్థాయి సమావేశాలు, ఓరియెంటేషన్‌ సమావేశాలు, బూత్‌ కమిటీల ఏర్పాటు జరుగుతోందని, సెప్టెంబర్‌ 15 నుంచి 25 వరకు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్‌లో రఫెల్‌ కుంభకోణంపై ఏపీలో కోటి కుటుంబాలకు కరపత్రాలను పంచుతామని ఈ సందర్భంగా తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top