లేట్‌ లేటే అవుతుందీ రాహుల్‌!

Rahul Gandhi Late Reasponse In Lok Sabha Over Criticism - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం జరిగిన చర్చలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆద్యంతం ఆవేశంతోనే మాట్లాడారు. ఎక్కడా వేడి తగ్గకుండా రాఫెల్‌ విమానాల రాకెట్‌ దగ్గరి నుంచి దేశంలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలపై జరుగుతున్న దాడుల వరకు మోదీని నిలదీశారు. హిందీ భాషలో అనర్గళంగా మాట్లాడడంలో అక్కడక్కడా మాటలు తడబడినా, తలకిందులైనా, సర్దుకొని ముందుకు సాగారు. చివరలో ‘నేనంటే మీకు ద్వేషం. మీ దృష్టిలో నేనొక పప్పూను. కానీ మీరంటే నాకు ద్వేషం లేదు. నేను కాంగ్రెస్‌ను, నేను అందరినీ ప్రేమిస్తాను’ అంటూ ప్రసంగాన్ని ముగించిన రాహుల్‌ సరాసరి మోదీ వద్దకు వెళ్లి ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. దీనికి ఆశ్చర్యచకితుడైన మోదీ, రాహుల్‌ గాంధీని వెనక్కి పిలిచి అభినందన పూర్వకంగా కరచాలనం చేశారు.

ఈ సంఘటనతో అప్పటి వరకు వేడిగా ఉన్న సభా వాతావరణం ఒక్కసారిగా చల్లబడినట్లు అయింది. రాత్రి సభా చర్చకు సమాధానం ఇవ్వనున్న నరేంద్ర మోదీ రాహుల్‌ విమర్శలను ఎలా తిప్పి కొడతారో చూడాలి! ఈ రోజున తనకు చిక్కిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకొన్న రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ ముస్లింల పార్టీ అని తానన్నట్లు విరుచుకుపడిన మోదీ, నిర్మలా సీతారామన్, ఇతర నాయకుల విమర్శలకు సరైన సమాధానం ఇవ్వడంలో మాత్రం చాలా తాత్సారం చేశారు. 

‘నేను వరుసలో చివర నిల్చున్న వాడికి అండగా నిలబడతాను. సమాజంలో వెనకబడిన వాడికి, దోపిడీకి, దగాకు, అన్యాయానికి గురైన వాడి పక్కనుంటాను. వారి కులం, మతం, విశ్వాసాలతో నాకు సంబంధం లేదు. బాధ పడుతున్నవాడిని హత్తుకుంటాను, భయాన్ని, ద్వేషాన్ని పారద్రోలుతాను. ప్రాణం ఉన్న వాటన్నింటిని నేను ప్రేమిస్తాను. నేను కాంగ్రెస్‌ను’ అని ఈ నెల 17వ తేదీన రాహుల్‌ గాంధీ తనపై వచ్చిన విమర్శలకు బదులుగా ట్వీట్‌ చేశారు. ‘ది గుడ్‌ మేన్‌ ఈజ్‌ ది ఫ్రెండ్‌ ఆఫ్‌ ఆల్‌ లివింగ్‌ థింగ్స్‌’ అన్న జాతిపిత మహాత్మాగాంధీ సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ వ్యాఖ్యాలను ఎవరో సలహాదారులు రాహుల్‌కు రాసినట్లున్నారు. ఎవరు రాసినా సరే రాహుల్‌ సకాలంలో స్పందించలేకపోయారు. 

రాహుల్‌ గాంధీ, ముస్లిం మేధావులతో ఈ నెల 11వ తేదీన సమావేశమయ్యారు. ‘కాంగ్రెస్‌ ముస్లింల పార్టీ’ అన్నట్లు 12వ తేదీన ‘ఇంక్విలాబ్‌’ ఉర్దూ పత్రిక వార్తను ప్రచురించింది. దేశంలో జరిగే అల్లర్లకు ఇక నుంచి రాహుల్‌ గాంధీయే బాధ్యత వహించాలంటూ 13వ తేదీన సీతారామన్‌ వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ ముస్లిం పురుషుల పక్షమా, ముస్లింల మహిళల పక్షమా? అంటూ 14వ తేదీ నుంచి వరుసగా మోదీ విమర్శిస్తూ వస్తున్నారు. 17వ తేదీన రాహుల్‌ తాపీగా స్పందించారు. ‘లేట్‌ బెటర్‌ ద్యాన్‌ నెవర్‌’ అనుకొని ఉండవచ్చేమో. కానీ రాజకీయాల్లో లేట్‌ చేస్తే ‘లేట్‌’గానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top