ఓటమిని కూడా గెలుపుగా భ్రమించి..!

prakash jawadekar fires on Rahul Gandhi - Sakshi

న్యూఢిల్లీ: గుజరాత్‌ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా.. గెలిచినట్టు భ్రమపడి కాంగ్రెస్‌ పార్టీ ఆనందపడుతోందని బీజేపీ ఎదురుదాడి చేసింది. గుజరాత్‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధాని మోదీపై నిప్పులు చెరుగుతూ రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి, బీజేపీ నేత ప్రకాశ్‌ జవదేకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. పరాజయాన్ని కూడా గెలుపుగా భ్రమించి ఆనందపడుతున్నారని రాహుల్‌ను ఆయన ఎద్దేవా చేశారు. 'గుజరాత్ ఫలితాలపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు.. ప్రజాతీర్పును అవమానించడమే. వారసత్వ అహంకారం ఈ వ్యాఖ్యల్లో కనిపిస్తోంది' అని మండిపడ్డారు.

గుజరాత్‌ ఫలితాలు బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ అన్న రాహుల్‌ వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీకే ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. రాఫెల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంలో ఎలాంటి కుంభకోణం జరగలేదని, ఇది పాదర్శకంగా జరిగిందని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అమిత్‌షా కొడుకు జయ్‌ షా కూడా నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం చేశాడని వివరణ ఇచ్చారు.

గుజరాత్‌ ఎన్నికల్లో  బీజేపీ విజయం సాధించినా.. నైతిక విజయం మాత్రం కాంగ్రెస్‌దేనని రాహుల్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. విశ్లేషకులు, మీడియా ఊహకు అందని రీతిలో కాంగ్రెస్‌ సీట్లను కైవసం చేసుకుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మోదీ మోడల్‌ అన్నది ఓ ప్రచార స్టంట్‌గానే మిగిపోయిందని, బీజేపీ వెన్నులో వణుకు పుట్టించామని, ఈ ఫలితాలు బీజేపీకి పెద్ద దెబ్బ అని అన్నారు. ప్రచారంలో మోదీ అభివృద్ధి గురించి ఒక్క మాటా మాట్లాడలేదని... కానీ, ఇప్పుడు గెలిచాక అభివృద్ధి వల్లే తాము గెలిచామంటూ చెప్పుకుంటున్నారన్నారు. ఈ లెక్కన మోదీ విశ్వసనీయత కోల్పోయినట్లేనని రాహుల్‌ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top