‘కళ్ల ముందే నా భర్తను కాల్చిచంపారు’

Pradeep Mandal Killed By TMC Workers Says His Wife Padma - Sakshi

బెంగాల్‌లో హత్యకు గురైన బీజేపీ కార్యకర్త భార్య ఆవేదన

టీఎంసీ కార్యకర్తలే చంపారని ఆరోపణ

బెంగాల్‌ హింసపై కేంద్రం ఆదోళన

కోల్‌కత్తా:  తన కళ్ల ముందే తన భర్తను తృణమూల్‌ కార్యకర్తలు కాల్చిచంపారని రెండురోజుల క్రితం హత్యకు గురైన బీజేపీ కార్యకర్త ప్రదీప్‌ భార్య పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి బెంగాల్‌లోని 24 పరగణా జిల్లాలో బీజేపీ-టీఎంసీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు బీజేపీ మద్దతుదారులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వీరిలో ప్రదీప్‌ మొండల్‌ అనే వ్యక్తిని తన ఇంట్లోనే భార్య ముందే దారణంగా కాల్చిచంపారని ఆయన భార్య పద్మ మొండల్‌ కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రదీప్‌తో పాటు శంకర్‌ మొండల్‌ను కూడా ఇదే విధంగా కాల్చి చంపారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇదిలావుడంగా.. పశ్చిమబెంగాల్‌లో (టీఎంసీ), బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణల అనంతరం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర హోంశాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 

బెంగాల్‌లో శాంతిభద్రతలను పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హింసను అరికట్టడంలో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించింది. ఆందోళనలు, అల్లర్లను నియంత్రించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని హితవు పలికింది. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం కేంద్రానికి జవాబు ఇచ్చింది. సంఘవిద్రోహక శక్తుల కారణంగా చెలరేగిన అల్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని స్పష్టం చేసింది.   

ఉత్తర 24 పరగణాల జిల్లాలో శనివారం రాత్రి టీఎంసీ, బీజేపీ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బీజేపీ, టీఎంసీ నేతలు మాటలయుద్ధానికి దిగారు. టీఎంసీ శ్రేణుల దాడుల్లో బీజేపీ కార్యకర్తలు చనిపోయారని బీజేపీ ప్రధాన కార్యదర్శి సయతన్‌ బసూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఘర్షణల్లో కయూమ్‌ మొల్లాహ్‌ అనే టీఎంసీ కార్యకర్త చనిపోయినట్లు టీఎంసీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు బీజేపీ కార్యకర్తల మృతదేహాలతో కోల్‌కతాలోని పార్టీ కార్యాలయానికి కమలనాథులు ఊరేగింపుగా తీసుకురాగా, పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీ తన ప్రసంగాల ద్వారా రాజకీయ ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని బీజేపీ నేత ముకుల్‌రాయ్‌ ఆరోపించారు. తమ కార్యకర్తల చావుకు నిరసనగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగడంతో 11 మంది మహిళలు సహా 62 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top