ఆ ఐదుగురిపై పోసాని కృష్ణమురళి ఫైర్‌

Posani krishna Murali Fires on Tollywood Bigshots - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు సినీ పరిశ్రమ మద్దతు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమానికి ఉంటుందని సినీ పెద్దలు ప్రకటన చేయడాన్ని ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణమురళి తీవ్రంగా తప్పుబట్టారు. మొత్తం సినీ పరిశ్రమ తరఫున వకాల్తా పుచ్చుకొని చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి మీరు ఎవరు అంటూ ఆయన నిలదీశారు. అశ్వనీదత్‌, కేఎల్‌ నారాయణ, రాఘవేంద్రరావు, కే నారాయణ, వెంకటేశ్వర్‌రావు, కిరణ్‌ తదితరులు చంద్రబాబును కలిసి చిత్ర పరిశ్రమ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందంటూ ప్రకటన చేసినట్టు ఓ పత్రికలో వచ్చిందని, దీనిపై వివరణ ఇవ్వాలని పోసాని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలు కూడా ఉద్యమాలు చేశాయని, వారి ఉద్యమానికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదని సినీ పెద్దలను నిలదీశారు. సీఎంకు ఇలా మద్దతు ఇవ్వడం కులం రంగు పులుముకుంటోందని, చంద్రబాబు కమ్మ ముఖ్యమంత్రి కాబట్టి.. మేమంతా కమ్మోళ్లం చంద్రబాబుకు సపోర్టుగా ఉంటాం అన్నట్టుగా ఇది ఉందని ఆయన మండిపడ్డారు. ఆయన ఏమన్నారంటే..

‘హోదా ఉద్యమానికి చిత్ర పరిశ్రమ మద్దతు అంటూ ఓ పత్రికలో కథనం వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఒకేతాటిపైకి వచ్చి సీఎంగారు చేస్తున్న ఉద్యమానికి బాసటగా ఉంటామని ఆ పత్రికలో స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. నేను చిత్ర పరిశ్రమలో 33ఏళ్లకుపైగానే ఉన్నా. ఈ విషయం గురించి నాకు ఎవరు ఫోన్‌ చేసి చెప్పలేదు. మీటింగ్‌ పెట్టి అందర్నీ ఎవరూ పిలువలేదు. అలాంటప్పుడు మీరు నలుగురైదుగురు సీఎంకు వద్దకు వెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం మీకు మద్దతుగా ఉంటుందని ఎలా చెప్తారు. సీఎం చంద్రబాబును అశ్వనీదత్‌, కేఎల్‌ నారాయణ, రాఘవేంద్రరావు, కే నారాయణ, వెంకటేశ్వర్‌రావు, కిరణ్‌ కలిశారు. వీళ్లు ఐదుగురు మాత్రమే సినీ పరిశ్రమ మొత్తం తరఫున వకాల్తా పుచ్చుకొని ఎలా హామీ ఇస్తారు? ఇది పత్రికలో వచ్చిన అబద్ధమా? అయితే ఈ వార్త అబద్ధమని, మేం వ్యక్తిగతంగానే సీఎంను కలిశాం. కానీ ఇండస్ట్రీ తరఫున రాలేదని మీరు వివరణ ఇచ్చి ఉండాలి? ఇప్పటివరకు ఎందుకు వివరణ ఇవ్వలేదు? కేఎల్‌ నారాయణ జెంటిల్మెన్‌. క్యాస్ట్‌ రంగు పులుముకొని తిరగరు. కిరణ్‌గారు కూడా అంతే. వారందరూ అంటే నాకు గౌరవ ఉంది. కానీ ఎఇలా ప్రకటన చేయడం బాగాలేదు’ అని పోసాని అన్నారు.

నేను చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం లేదు!
‘సినీ పరిశ్రమ మొత్తం చంద్రబాబు హోదా ఉద్యమానికి మద్దతుగా ఉంటుందని వారు చెప్పారు. కానీ నేను మద్దతు ఇవ్వడం లేదు. వీళ్లు సినీ పరిశ్రమ తరఫున ఎలా సీఎంకు హామీ ఇస్తారు? అని కొందరు నన్ను అడుగుతున్నారు. సీఎంకు ఇలా మద్దతు ఇవ్వడం కులం రంగు పులుముకుంటోంది. చంద్రబాబు కమ్మ ముఖ్యమంత్రి కాబట్టి.. మేమంతా కమ్మోళ్లం చంద్రబాబుకు సపోర్టు అన్నట్టుగా ఇది ఉంది. మమ్మల్ని అడగకుండా ఎలా మొత్తం సినీ పరిశ్రమ తరఫున మద్దతు ఇస్తారు? ఇండస్ట్రీ అంటే ఆ ఐదుగురేనా? మీరు ఇలాంటి సేట్‌మెంట్‌ ఇచ్చి ఉండకుంటే.. పేపర్‌ వాళ్లు తప్పు రాశారని ప్రకటన ఇవ్వండి’ అని పోసాని కోరారు.

‘చంద్రబాబు వల్ల ప్రజలకు నష్టం జరిగింది. ఆయన ఒకసారి ప్రత్యేక హోదా కావాలన్నారు. తర్వాత ప్రత్యేక హోదా అక్కర్లేదు ప్యాకేజీ చాలు అన్నారు. చంద్రబాబు తన రాజకీయ అవసరం కోసం ప్రత్యేక హోదా ఉద్యమం చేస్తున్నారు. అందుకే మద్దతు ఇచ్చేందుకే మీరు వచ్చారా? మీకు అభిమానం ఉంటే.. వ్యక్తిగతంగా వెళ్లి చంద్రబాబుకు మద్దతు ఇచ్చుకోండి. అంతేకానీ సినీ పరిశ్రమలోని వేలమంది తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడే హక్కు మీకు ఉండదు. ఈ ప్రభుత్వం తప్పులు చేస్తోంది. ఈ ముఖ్యమంత్రి తప్పుల మీద తప్పులు చేస్తున్నారంటూ పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు అఖిలపక్ష భేటీకి వెళ్లలేదు. పవన్‌ కల్యాణ్‌ సపోర్ట్‌ చేయడం వల్లే ఒక్కశాతం ఓట్లు అధికంగా వచ్చి తెలుగుదేశం గెలిచింది. అందుకే మీరు పవన్‌కు సన్మానం చేశారు. ఆయన కొంచెం విమర్శించడంతో ఇప్పుడు ఆయనపై మండిపడుతున్నారు’ అని అన్నారు.

ప్రత్యేక హోదా మీద మీకు ప్రేమ ఉంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమం చేస్తున్నారు. ఆయనకు ఎందుకు మద్దతు తెలుపలేదు. ఢిల్లీలో ఎంపీలు అన్నాపానాలు మరిచి దీక్ష చేశారు. పెద్ద వయస్సులో ఉన్నప్పటికీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌ ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా దీక్ష చేశారు. మరి మీరు ఢిల్లీకి వెళ్లి.. ఎందుకు ఆ ఐదుగురు ఎంపీలకు సానుభూతి తెలుపలేదు. కేవలం చంద్రబాబుకు మాత్రమే మద్దతు ఇస్తారా? వైఎస్‌ జగన్‌ది ఉద్యమం కాదా? వామపక్షాలది ఉద్యమం కాదా? కాంగ్రెస్‌ పార్టీది ఉద్యమం కాదా? చలసానిది ఉద్యమం కాదా?’ అని ప్రశ్నించారు. ‘హోదాపై చంద్రబాబు ఎన్నిసార్లు మాట మార్చారో మీకు తెలియదా? మీరు పెద్దమనుషులు.. ఇలాంటి తప్పులు చేయకూడదు. కానీ మా తరఫున ఇలా వకాల్తా తీసుకొని మాట్లాడకూడదు’ అని సినీ పెద్దలకు పోసాని సూచించారు. ఒకవేళ ఈ ప్రకటన చేసి ఉండకుంటే.. ఇలాంటి ప్రకటన తాము చేయలేదని ప్రెస్‌మీట్‌ పెట్టి వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ప్రత్యేక హోదా ఉద్యమం చేస్తున్న అందరికీ కళాకారుల తరఫున మద్దతు ఇవ్వాలని సూచించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top