సభలో హంగామా తప్ప ఏమీ లేదు

Ponnam Prabhakar Satires On Trs Pragathi Nivedana Sabha - Sakshi

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది

ప్రగతి నివేదన సభపై పొన్నం సెటైర్స్‌

సాక్షి, కరీంనగర్‌ : టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభలో హంగామా తప్ప ఏమీ లేదని, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి నివేదన సభను చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. సభ అట్టర్‌ ఫ్లాఫ్‌ అయిందనడానికి సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌లో నుంచి తీసిని ఏరియల్‌ వ్యూ విజువల్సే సాక్ష్యమన్నారు. పత్రికలు మాత్రం గోరింతలను కొండంతలు చేశాయన్నారు. దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. పత్రికలకు ముందస్తు ఎన్నికలంటూ లీకులిచ్చి ఇప్పుడేమో మ్యానిఫెస్టో కమిటీ త్వరలో వేస్తానంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రజాసంఘాలు టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.

విరసం నేత వరవరరావు అరెస్ట్‌పై ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదన్నారు. ఢిల్లీ దగ్గర మోకరిల్లుతామని మమ్మల్ని విమర్శిస్తున్న కేసీఆర్‌, ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర మోకరిల్లడం లేదా అని ప్రశ్నించారు. ఫెడరల్‌ విధానంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఎంతో కీలకమని తెలిపారు. ప్రధాన మంత్రిని ‘ఇస్తావా చస్తావా’  అని బెదిరించి జోనల్‌ విధానాన్ని సాధించానని చెబితే నవ్వొచ్చిందన్నారు. ఇదే మాట నాలుగేళ్ల కింద ఎందకడగలేదని నిలదీశారు. ముస్లిం, గిరిజిన రిజర్వేషన్లపై ఇదే తరహాలో మోదీని ఎందుకు అడగడం లేదన్నారు. విభజన హామీలు ఎందుకు సాధించలేక పోయావని ప్రశ్నించారు. రాష్ట్రంలో 15 రోజుల్లోనే 500 పైగా రైతులు చనిపోయారని, రాష్ట్రంలో హెల్త్‌ ఎమ్మెర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విద్యుత్‌ ఉద్యోగులకు జీతాలు పెంచిన కేసీఆర్‌.. హరీశ్‌ రావు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నందుకే ఆర్టీసీ కార్మికులకు వేతనాలు పెంచడం లేదా అని ప్రశ్నించారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top