సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కంటోన్మెంట్ మాదిరిగానే ఇక్కడ అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించారు అని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ సానుభూతి, డైవర్షన్ పాలిటిక్స్ పనిచేయలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.
జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ..‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజా పాలన ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన సరళి, ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఆకాంక్షించి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు. కంటోన్మెంట్ మాదిరి ఇక్కడ అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించారు. మహిళల సెంటిమెంట్ వాడుకోవడానికి బీఆర్‌ఎస్ అన్ని రకాల ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం, రేషన్ కార్డులు పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు వడ్డీలేని రుణాలు, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగ నియామకాలు, గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు మాకు అండగా ఉన్నారు.
మా ప్రభుత్వం అన్ని అంశాలు క్షేత్ర స్థాయిలో చేరేలా పని చేస్తున్నాం.. ఈ ఫలితం ప్రభుత్వ కార్యక్రమాలకు నిదర్శనం. బీఆర్‌ఎస్ చేసిన దుష్ప్రచారం పరిగణనలోకి తీసుకొని మా ప్రభుత్వం మరింత బలంగా పని చేస్తుంది. ఓడిపోతున్నామని అసహనంతో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ రిగ్గింగ్ ఆరోపణలు చేసింది.. వాళ్ళే మా పార్టీ కార్యాలయంపై దాడి కి ప్రయత్నం చేశారు. మీ సంగతి చూస్తా అనే మాటలు ఆశ్చర్యం కలిగించింది. పోలీసులు మా నాయకులు అక్కడ ఉండవద్దు అని కేసులు పెట్టారు. వాళ్ళలో అనేక మంది బయట వాళ్ళు ఉన్నారు.. సికింద్రాబాద్ కార్పొరేటర్ అక్కడే ఉండి టీవీలకు బైట్ ఇచ్చారు. వాళ్ళే అన్ని రకాల ప్రయత్నాలు చేశారు.. అసహనంతో ఇలా మాట్లాడుతున్నారు.
కంటోన్మెంట్ ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించి గెలిపించారు.. ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించి గెలిపిస్తున్నారు. ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలుస్తుంది. ముందు నుండి చెప్తున్నట్టు బీజేపీకి 10వేల ఓట్లు కూడా రావు. \కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కు అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి సహకరించినందుకు కిషన్ రెడ్డి గురు దక్షిణ కింద బీఆర్‌ఎస్‌కి సహకరించారు. దీనికి కిషన్ రెడ్డి జవాబు చెప్పాలి. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ ఉండే ఇప్పుడు గల్లీలో కూడా దోస్తీగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు సహకరిస్తే మంచిది.. లేకపోతే తెలంగాణ ప్రజలు మీ ఆఫీసుకి తాళాలు వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’ అని హెచ్చరించారు.


