అల్లుళ్లు అత్తారింటికి రావడం లేదు: పొన్నాల

Ponnala Lakshmaiah comments on KCR - Sakshi

బచ్చన్నపేట: ముఖ్యమంత్రి కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఎక్కడ కట్టారో చెప్పాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఈ పథకం సరిగా అమలు కాకపోవడంతో అల్లుళ్లు అత్తారింటికి రావడం లేదని ఎద్దేవా చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో పల్లె నుంచి ప్రగతి భవన్‌ వరకు అల్లుళ్ల బస్సు యాత్రను మంగళవారం జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ తెలంగాణలో పేదల ఇల్లు చిన్నగా ఉన్నాయని, అందులోనే గొర్రెలు, బర్రెలను తోలుకొని మనుషులు ఓ మూలన పడుకుంటారని సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు.

అల్లుళ్లు ఇంటికి వస్తే అత్తలు బయట పడుకునే పరిస్థితి నెలకొందని, అందుకే వారందరికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పిన కేసీఆర్‌.. వాటిని ఎక్కడ కట్టించారో చూపించాలని డిమాండ్‌ చేశారు. అల్లుళ్ల మనోభావాలు దెబ్బతిని బస్సుయాత్రను చేస్తున్నారని తెలిపారు. కాగా, బస్సు యాత్రలో వెళ్తున్న వారిని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం వద్ద పోలీసులు బస్సు యాత్రను అడ్డుకొని అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించి సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top