ఓటు హక్కుపై చైతన్యం పెంచండి

PM tweets to politicos, bats for increased voter participation - Sakshi

వివిధ రంగాల ప్రముఖులకు ప్రధాని మోదీ పిలుపు

ప్రణబ్, రాహుల్, రతన్‌ టాటా, కేసీఆర్, చంద్రబాబు, వైఎస్‌ జగన్, నాగార్జున తదితరులను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్లు

సాక్షి, న్యూఢిల్లీ: ఓటింగ్‌ శాతం పెరిగితే అది దేశానికి శుభసూచకం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలంతా ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన పెంచాలని పలు రంగాల ప్రముఖులకు పిలుపునిచ్చారు. రాజకీయ, సినీ, క్రీడా, సామాజిక, వినోద రంగాల ప్రముఖులను ట్యాగ్‌ చేస్తూ ప్రధాని బుధవారం వరస ట్వీట్లతో పాటు ప్రత్యేక బ్లాగ్‌ రాశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్, వ్యాపార దిగ్గజం రతన్‌ టాటా, బెంగాల్‌ సీఎం మమత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు నాగార్జున, మోహన్‌లాల్‌ తదితరుల పేర్లు ప్రస్తావించారు. తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు, ఏపీ సీఎం చంద్రబాబు, బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్, షారూక్‌ ఖాన్, దీపికా పదుకొణె తదితరులను ట్యాగ్‌ చేశారు. మీడియా రంగ ప్రముఖులు వినీత్‌ జైన్, సంజయ్‌ గుప్తా, అరుణ్‌ పూరీలతో పాటు సంస్థలు పీటీఐ, ఏఎన్‌ఐలను జతచేస్తూ ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకమన్నారు.

ఓటేయకుంటే ఆ నొప్పి తెలియాలి
‘అధిక ఓటింగ్‌ శాతంతో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. అది దేశానికి శుభసూచకం కూడా. పటిష్ట ప్రజాస్వామ్యంతోనే దేశం అభివృద్ధి చెందుతుంది. గత కొన్నేళ్లుగా ఓటింగ్‌ శాతం పెరుగుతోంది.  ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూడా అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఓటు విలువను తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన పెంచాలని రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాల ప్రముఖులను కోరుతున్నా. దేశ ప్రగతి పథంలో భాగస్వామి అయ్యేందుకు పౌరుడి ఇష్టాన్ని ఓటు సూచిస్తుంది. పోలింగ్‌ బూతులకు వచ్చి ఓటుహక్కు వినియోగించుకోని వారికి ఆ బాధ తెలియాలి. భవిష్యత్తులో మీరు కోరుకోని, అవాంఛనీయ పరిస్థితి రావాలని అనుకుంటున్నారా? మీరు ఆ రోజు ఓటేయనందుకే ఈ పరిస్థితి తలెత్తిందని చింతిస్తారా?’ అని మోదీ బ్లాగ్‌లో ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top