లోక్‌సభలో మోదీ మాటల తూటాలు..

PM Narendra Modi Speech In Lok Sabha - Sakshi

ఇందిర భారత్‌ను పెద్ద జైలుగా మార్చారు

పీవీ, మన్మోహన్‌లకు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు

కాంగ్రెస్‌ నేల విడిచి సాము చేసింది

మా పాలనకు ఫలితాలే నిదర్శనం.. మా ప్రభుత్వం పేదలకు అంకితం

రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభలో ప్రధాని మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: విపక్ష కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడిన మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌లకు భారతరత్న పురస్కారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని తమ ప్రభుత్వం భారతరత్నతో గౌరవించిందని గుర్తుచేశారు. ఇందిర హయాంలో విధించిన అత్యవసర పరిస్థితి దేశ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందని మండిపడ్డారు. ఆమె పాలనా కాలంలో భారత్‌ను పెద్ద జైలుగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్‌ నేలవిడిచి సాము చేసిందని.. మన్మోహన్‌ సింగ్‌ పాలనను కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికీ పొగడలేకపోతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారికి పాలనపై కనీస అవగహాన లేదని.. ఇతర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని వారు గుర్తించలేదని ధ్వజమెత్తారు.

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చకు సమాధానంగా మంగళవారం సాయంత్రం ప్రధాని మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజల మనోభావాలకు అద్దం పట్టిందని అన్నారు. తమపై నమ్మకం ఉంచి మరోసారి అధికారం అప్పగించినందుకు ప్రజలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రజల, మహాపురుషుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మోదీ స్పష్టం చేశారు.  నూతన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సమర్థవంతంగా సభను నడుపుతున్నారని కితాబిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంపై విపక్ష సభ్యులు చేసిన సలహాలను స్వీకరిస్తామని ప్రకటించారు. సభలో మోదీ మాట్లాడుతున్న సమయంలో బీజేపీ సభ్యుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఆయన మాటలను ఆమోదిస్తూ.. బల్లలు చరుస్తూ.. సభ్యులంతా పూర్తి సంఘీభావం తెలిపారు.

గడిచిన ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం అందించిన సుపరిపాలనకు ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశానికి సేవచేసేందుకు అనేక ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొన్నామని, దేశ ప్రగతి కోసం అనేక విధాలుగా ఆలోచిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని, ఓటు వేసేముందు ప్రజలు అనేక విధాలుగా ఆలోచించి తమకు ఓటు వేశారని మోదీ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు ముఖ్యంకాదని, దేశ అభివృద్ధికి విపక్షాలు సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు.

లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం కంటే పెద్ద విజయం మరొకటి ఉండదు. ప్రతి పౌరుడు తన హక్కుల కోసం పోరాడాలి. మా ప్రభుత్వం పేదవారందరికీ అంకితమని 2014లోనే స్పష్టం చేశాం. వారికిచ్చి అనేక హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తాం. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. పేదరిక నిర్మూలనకు మరింత కృషి చేస్తాం. రోడ్ల నుంచి అంతరిక్షం వరకూ గడిచిన ఐదేళ్లలో దేశం  ఎన్నో లక్ష్యాలను చేరుకుంది‘‘ అని అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top