
చండీగఢ్: అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని తిరిగి తెస్తామని హామీ ఇచ్చే దమ్ము కాంగ్రెస్‌కి ఉందా అని ప్రధాని నరేంద్రమోదీ నిలదీశారు. హరియాణాలోని చార్కి దాద్రిలో బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. యావత్ దేశం ఈ నిర్ణయానికి మద్దతుగా నిలిస్తే.. కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం దేశ, విదేశాల్లో పుకార్లు వ్యాపింపజేస్తున్నారని మండిపడ్డారు. తనపై ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోనన్న ప్రధాని మోదీ....దేశానికి వెన్నుపోటు పొడిస్తే మాత్రం సహించేది లేదని స్పష్టంచేశారు. కర్తార్‌పూర్ కారిడార్ పూర్తికానుండటం ఆనందంగా ఉందని, ఏడు దశబ్దాల కిందట జరిగిన రాజకీయ, వ్యూహాత్మక తప్పిదాలను కొంతమేర మా ప్రభుత్వం సరిచేయడం ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు.