‘చంద్రబాబుకు ప్రజామోదం లేదని మా సర్వేలో తేలింది’

Piyush Goyal Slams Chandrababu Naidu In Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం: యూటర్న్‌ చంద్రబాబు నాయుడుకు ప్రజామోదం లేదని తమ సర్వేలో తేలిందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. మంగళవారం రోజున విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన పీయూష్‌ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ సహకారం లేకపోతే 2014 ఎన్నికల్లో అశోక్‌ గజపతిరాజు గెలిచేవారు కాదని అన్నారు. కేంద్రం అడిగినదానికంటే ఎక్కువ సహకారం అందిస్తుందని చెప్పిన చంద్రబాబు మాట మార్చారని గుర్తుచేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు గురించి లెక్కడిగితే.. చంద్రబాబు నుంచి నేటీకి సమాధానం లేదన్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ చంద్రబాబు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ నెల 11వ తేదీన ప్రజలు వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడాలని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా వలన ఒరిగేది ఏమి లేదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, నిధులు మంజూరు చేస్తే.. చంద్రబాబు బృందం దోచుకోవాల్సినంత దోచుకున్నారు. సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టకూడదని చెప్పిన ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కరేనని విమర్శించారు. ఆలోచించి అందరికీ ఆమోదయోగ్యమైన రైల్వే జోన్‌ అందించామన్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం రెండు వేల కోట్ల రూపాయలు అందిస్తే.. చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూపిస్తూ, తాత్కాలిక భవనాల్లో కాలం వెల్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామిచ్చే పథకాలకు చంద్రబాబు ఆయన స్టిక్కర్లు అంటించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top