‘జగన్‌కు ఒక అవకాశమిస్తే బాగుంటుందేమో...’ కొద్ది నెలల క్రితం వరకు రాష్ట్ర ప్రజల్లో వినిపించిన మాటిది. ఇప్పుడు అదే జనం మాటల్లో మరింత స్పష్టత వచ్చింది. ‘ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాల్సిందే..’ అంటున్నారు. నిజమైన జననేత జగనే అని విశ్వసించే వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. ఈ పరిణామం వాస్తవమేనని రాజకీయ పరిశీలకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
సాక్షి, అమరావతి : పాదయాత్ర ముగిసిన ప్రతి జిల్లాలోనూ ఊరూరా అన్ని వర్గాలు వారూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆయన చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర గమ్యానికి చేరువయ్యే కొద్దీ జనాభీష్టంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం కూడా శర వేగంగా మారుతోంది. భావినేత ఎంపికలో ఈసారి నిక్కచ్చిగా వ్యవహరించకపోతే మళ్లీ నష్టపోతామన్న భయాందోళన జనంలో కొట్టొచ్చినట్టూ కనిపిస్తోంది. సామాజిక మాథ్యమాల్లోనూ ఇదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో జరిగిన నష్టం.. ప్రత్యేక హోదా సాధనలో నయ వంచన.. ఇచ్చిన హామీలకే దిక్కులేని దైన్య స్థితి.. ఉట్టెక్కిన సంక్షేమంతో పేదలు ఉక్కిరిబిక్కిరి.. అవినీతి.. అరాచకం.. అన్ని వర్గాలను ఆందోళన కల్గిస్తోంది. ఈ దిశగా మార్పు తెస్తానంటూ ముందుకొచ్చిన జగన్ వైపు జనం దృష్టి సారించారు. అందరిలో మమేకమవుతూ, సమస్యలపై పోరాడుతున్న నేపథ్యాన్ని నిశితంగా గమనిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుండటం కూడా జనాదరణకు కారణమైంది. మాటిస్తే ఏనాటికీ తప్పని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వం కావడంతో మరో అర్హతగా మారింది. పోరుబాటలో పక్కా ప్రణాళికను ప్రకటించడం.. ఆచరణలోనూ అదే రీతిలో ముందుకెళ్లడం జనాభిమానాన్ని రెట్టింపు చేసింది.
పోరాటాల అనుభవం...
అదే ప్రభంజనం
‘జగన్ యువకుడు.. అనుభవం కావాలని నాలుగేళ్ల క్రితం అనుకున్నాం.. కానీ ఇప్పుడా మాట అనలేకపోతున్నాం. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన తీరు, ఉద్యమాలతో ప్రజా క్షేత్రంలో దూసుకుపోవడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. గెలిస్తే మంచి పాలన ఇస్తాడని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి?’ కృష్ణా జిల్లా నిమ్మకూరు వద్ద ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన వెంకటేశ్వరరావు మనసులోంచి వచ్చిన మాటిది. ఏ విషయంలోనైనా జగన్ వైఖరి ఇలాగే ఉంటోంది.
అందుకే జగన్ కావాలనుకుంటున్నారు..
‘కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. అనుభవజ్ఞుడైన సీఎం కావాలనుకున్నాం. ఇదే రాష్ట్రానికి శాపమైంది. ఇక ఆ పొరపాటు చేయం’ – కర్నూలు జిల్లా బనగానపల్లి వద్ద టీడీపీకి ఓటేసిన 60 ఏళ్ల రామభూపాల్ చెప్పిన మాటిది. ఇతనే కాదు.. అన్ని వర్గాల వారు ఇలానే అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం అవినీతిని రెట్టింపు చేసిందనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘మాటల గారడీ తప్ప అభివృద్ధి మచ్చుకైనా కన్పించలేదు.. మా నేతకు ఇంకెలా ఓటేస్తారు’ అని సూళ్లూరుపేటకు చెందిన టీడీపీ కార్యకర్త మదన్‌మోహన్ నిర్వేదంతో అన్నాడు. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ చంద్రబాబు మోసం చేశారని యువత కన్నెర్ర చేస్తోంది. ఈ పరిణామాలన్నీ మార్పు కావాలనే దిశగా ప్రజలను తీసుకెళ్తున్నాయి.
జగన్ వస్తేనే విద్యార్థులకు మంచి రోజులు
‘హోదా వస్తేనే కొత్తగా పరిశ్రమలు, హోటళ్లు లాంటివి పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తారు. అప్పుడే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇదే విషయాన్ని జగన్ నాలుగేళ్లుగా చెబుతున్నాడు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం జగన్ చేస్తున్న అలుపెరగని పోరాటం మరువలేనిది. నేడు రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యకు దూరం అవుతున్నారు. తానొస్తే పేదల చదువు కోసం ఎంత ఖర్చు అయినా భరిస్తానని చెబుతున్న జగన్ చెబుతున్న మాటల్లో నిజాయితీ కనిపిస్తోంది. అందుకే ఈసారి ఆయన సీఎం కావాల్సిందే. జగనన్న వస్తేనే మాకు మేలు జరుగుతుంది. మా విద్యార్థి లోకమంతా అన్న వెంటే ఉంది.’
– కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన బి.అశోక్ అనే విద్యార్థి మాటలివి
జననేతతోనే రైతు రాజ్యం
‘నాలుగేళ్లుగా ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులంటే ఈ ప్రభుత్వానికి చులకన. దేశానికి అన్నం పెట్టే అన్నదాతను ఆదుకుందామన్న తలంపే లేదు. జగన్ రైతుల గురించి చాలా లోతుగా ఆలోచించారు. రైతు సమస్యలపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే ఆయన రైతు శ్రేయస్సు కోసం పరితపిస్తున్నారు. పెట్టుబడికి పనికొస్తుందని ఏటా రూ.12,500 ఇస్తానని, 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తానని, గిట్టుబాటు ధరలు కల్పిస్తానని, ఉచితంగా బోర్లు వేయిస్తానని చెబుతున్నాడు. ఆయన చెప్పారంటే చేసి తీరుతారు. అందుకే జగన్ సీఎం కావాలని మా రైతాంగమంతా కోరుకుంటోంది.
– ఇ.రమణయ్య, రైతు, గిద్దలూరు, ప్రకాశం జిల్లా


