నిరుత్సాహం

People Avoid Rahul Gandhi Meeting in Tirupati - Sakshi

ఉత్సాహం నింపని కాంగ్రెస్‌ సభ

సమస్యల ప్రస్తావనే లేకుండా సాగిన ప్రసంగాలు

జనం లేకపోవటంతో రాహుల్‌ తీవ్ర అసంతృప్తి

మాజీ సీఎం కిరణ్‌కు మాట్లాడే అవకాశం కల్పించని వైనం

సభ విజయవంతానికి కాంగ్రెస్, టీడీపీ నేతల ప్రయత్నాలు విఫలం

సాక్షి, తిరుపతి : ఇటు కాంగ్రెస్, అటు టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన ప్రత్యేక హోదా భరోసా యాత్ర బహిరంగ సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.  ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బహిరంగ సభకు హాజరైనా ఉత్సాహాన్ని నింపలేదు. రాష్ట్ర, జిల్లా సమస్యలపై రాహుల్‌ హామీ ఇస్తారని భావించి సభకు హాజరైన జనం తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి మాట్లాడే అవకాశం కల్పించలేదు. ఇలా తిరుపతి తారకరామ స్టేడియంలో శుక్రవారం కాంగ్రెస్‌ నిర్వహించిన ప్రత్యేక హోదా భరోసా యాత్ర బహిరంగ సభ అందరినీ నిరుత్సాహపరచింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌ని విడగొట్టడంలో కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని విభజించిన పాపాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్‌ రాష్ట్రంలో కనుమరుగైంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉనికి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో ప్రత్యేక హోదా భరోసా యాత్రఒకటి. రాష్ట్రాన్ని విడగొట్టి ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా నినాదంతో ఎన్నికల్లో ప్రవేశించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా టీడీపీతో జతకట్టి ముందుకు వెళ్లాలని భావించింది. అయితే తెలంగాణా ఎన్నికల్లో కలసి వెళ్లిన కాంగ్రెస్, టీడీపీకి ఘోర పరాజయం ఎదురవడంతో ఆంధ్రప్రదేశ్‌లో తెరవెనుక నుంచి మంత్రాంగం నడుపుతున్నాయి.

డబ్బులు ఇస్తామన్నా రాని జనం..
రాహుల్‌ సభను విజయవంతం చేయాలని ఇటు కాంగ్రెస్, అటు టీడీపీ తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు చేశాయి. తిరుపతిలో జరిగే రాహుల్‌ సభకు జనాలను తరలించాలని సీఎం చంద్రబాబు జిల్లా టీడీపీ నాయకులకు ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా సభకు వస్తే ఒక్కొక్కరికి రూ.200 నుంచి రూ.300 ఇస్తామని ఆశ చూపారు. సభకు వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. అయితే జనం రావటానికి ఇష్టపడలేదని తెలుస్తోంది. అందుకు తారకరామ స్టేడియంలో జరిగిన సభే నిదర్శనం. సభకు 20 వేల నుంచి 30 వేల మందిని తీసుకురావాలని కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. ప్రతి గ్రామం నుంచి కనీసం 50 మందిని తరలించాలని భావించారు. తరలించే బాధ్యతను టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాని తీసుకున్నట్లు తెలిసింది. అయితే గ్రామాల్లో టీడీపీ, కాంగ్రెస్‌ నేతల పిలుపునకు స్పందించలేదు. వస్తామని చెప్పి డుమ్మా కొట్టారు. దీంతో 5 వేల మంది కూడా హాజరుకాలేదు.

తీవ్ర అసంతృప్తి..
ఏఐసీసీ అధ్యక్షుడి సభ అంటే కనీసం లక్ష మంది జనం వస్తా రు. అయితే తిరుపతిలో నిర్వహించిన సభకు కనీసం ఐదువేల మంది కూడా రాలేదు. దీంతో రాహుల్‌ గాంధీ తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్‌ శ్రేణులు వెల్లడించాయి. అందుకే హడావుడిగా ప్రసంగాన్ని ముగించి, ఢిల్లీ వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. ఇది లావుంటే కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థి అయిన రాహుల్‌గాంధీ రాష్ట్రంతో పాటు జిల్లాకు వరాలు జల్లులు కురిపిస్తారని సభకు హాజరైన జనం ఆశించారు. అయితే కేవలం ప్రత్యేక హోదా తప్ప మరే ఇతర సమస్యల గురించి ప్రస్తావించకపోవడంతో సభకు హాజరైన ప్రజలను, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులను తీవ్ర నిరుత్సాహంతో వెనుదిరగాల్సి వచ్చిం ది. అదేవిధంగా మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సభకు హాజరయ్యారు. జిల్లాకు చెందిన నాయకుడు కావడంతో పాటు రాష్ట్ర మాజీ సీఎం అయిన వ్యక్తి సభలో ప్రసంగించే అవకాశమే ఇవ్వకపోవటంతో ఆయన అసంతృప్తితో వెనుదిరిగారు. మొత్తంగా కాంగ్రెస్, టీడీపీ నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రత్యేక హోదా భరోసా యాత్ర సభ అందరినీ నిరుత్సాహపరిచింది.

కాంగ్రెస్‌తోనే సంక్షేమం
తిరుపతి అర్బన్‌/యూనివర్సిటీ క్యాంపస్‌: దేశంలో అన్ని వర్గాలకు సంక్షేమం చేకూరాలంటే రాహుల్‌గాంధీ నేతృత్వంలోని యువ నాయకత్వం అవసరమని రాష్ట్ర కాంగ్రెస్‌ (పీసీసీ) అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి అన్నారు. పీసీసీ ఆధ్వర్యంలో ఈనెల 19న అనంతపురం జిల్లాలో ప్రారంభమైన ‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’ శుక్రవారం తిరుపతి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఎస్వీయూ తారకరామా స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో రఘువీరా మాట్లాడారు. రాహుల్‌ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ‘ప్రత్యేక హోదా’ ఇచ్చే ఫైల్‌పైనే తొలి సంతకం చేస్తుందన్నారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ప్రతి గుండె రాహుల్‌గాంధీనే శ్వాసగా ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ జాతీయ ప్లీనరీలోనూ హోదా అంశంపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి పళ్లం రాజు మాట్లాడుతూ ఏపీని దేశంలో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో రాహుల్‌గాంధీ ముందుకెళ్తున్నారన్నారు. అనంతరం వైఎస్సార్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, పీసీసీ సభ్యురాలు ప్రమీలమ్మ, ఏఐసీసీ కార్యదర్శి మస్తాన్‌వల్లీ, సీనియర్‌ నేత తులసిరెడ్డి, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు రమణకుమారి, పీసీసీ ప్రధాన కార్యదర్శి నజీర్, మాజీ ఎంపీ చింతామోహన్‌ కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి, రాష్ట్ర ఇన్‌చార్జి ఉమన్‌చాందీ, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు జేడీ శీలం, పనబాకలక్ష్మి, శైలజానాథ్, రెడ్డివారి చెంగారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్లు కనుమూరి బాపిరాజు, టి.సుబ్బిరామిరెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top