
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ‘చింతలపూడి నియోజకవర్గంలో రూ.1800 కోట్లతో అభివృద్ధి పనులు చేశాను. నా ఎదుగుదలను చూసి ఓర్వలేకే అంబికా కృష్ణ నాపై అసత్య ఆరోపణలు చేశారు. బుద్ధి ఉన్నోడు ఎవడూ అంత నీచంగా మాట్లాడడు’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీతల సుజాత అంబికా కృష్ణపై ధ్వజమెత్తారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీతల సుజాత హయాంలో అభివృద్ధి జరగలేదని, ఆ పాపం కడిగేసుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ అభ్యర్థిని మార్చారని జంగారెడ్డిగూడెంలో రెండు రోజుల క్రితం ఆర్యవైశ్యులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో అంబికా కృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీనిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ తరఫున ప్రచారం చేసి ఆర్యవైశ్యులను పార్టీకి దగ్గర చేయమని పార్టీ ఆదేశిస్తే, అంబికా కృష్ణ ఆ పని చేయకుండా తనపై ఆరోపణలు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రతిపక్షంతో లాలూచీ పడి తెలుగుదేశం పార్టీని ఓడించడానికి అంబికా కృష్ణ కంకణం కట్టుకున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. తానేమీ అంబికా కృష్ణలా సొంత బావమరిది హోటల్‌ను ఆక్రమించుకోలేదని, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు ఎగ్గొట్టలేదని ఎద్దేవా చేశారు.
సినీ రంగంలో ఆయన వేషాలు అందరికీ తెలుసని అన్నారు. ఒక దశలో ఆమె అంబికా కృష్ణ తనపై చేసిన వ్యాఖ్యలను తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు. దళిత మహిళననే తనపై ఇటువంటి ఆరోపణలు చేశారని, అగ్ర వర్ణాలు ప్రజాప్రతినిధులుగా ఉన్న మరో నియోజకవర్గంలోకి వెళ్లి అక్కడ అభివృద్ధి జరగలేదనే దమ్ము అంబికాకు ఉందా అని ప్రశ్నించారు. తనపై విమర్శలు చేసే వారిని ఇక ఉపేక్షించేది లేదని ఎవరినైనా చెంప ఛెళ్లుమనిపిస్తానని హెచ్చరించారు. అంబికా కృష్ణ తనపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.