ఒక్కో నియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి : పవన్‌

Pawan Kalyan Fire On Chandrababu Naidu - Sakshi

సాక్షి, చెన్నై : చంద్రబాబు నాయుడు వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవినీతిలో మునిగిపోయిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. బుధవారం చెన్నైలోని ఓ స్టార్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్‌ మాట్లాడుతూ.. ఏపీలోని ఒక్కో నియోజకవర్గంలో దాదాపు వెయ్యికోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. టీడీపీ, బీజేపీలు కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడు మిత్రుడు అవుతారో..ఎప్పుడు శత్రువు అవుతారో చెప్పలేమన్నారు. ఆయనను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. టీడీపీ, బీజేపీ కూటమి మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకొని వారికి మద్దతు ఇస్తే, చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని విమర్శించారు. (అందుకే పోటీ చేయడం లేదు: జనసేన)

పంచాయితీ రాజ్ మంత్రిగా కొడుకు లోకేష్‌  ఉన్నా చివరకు పంచాయతీ ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. దక్షిణ భారత్‌ను నడిపించే విధంగా ముందుకు సాగుతామన్నారు. అంబేద్కర్‌ చెప్పినట్లుగా దక్షిణాదిలో రెండో రాజధాని రావాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో అవసరమైతే రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లతో కలిసి కూడా పనిచేస్తానని పవన్‌ వివరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top