టీడీపీ.. బీసీ వ్యతిరేకి

Only 9 percent reservation to BCs with TDP Leader Case - Sakshi

తెలుగుదేశం నేత కేసు వల్ల 9.85 శాతం రిజర్వేషన్లు కోల్పోతున్న బీసీలు

పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో 59.85% రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్‌ సర్కార్‌ నిర్ణయం 

ఆ మేరకు ఎన్నికల నిర్వహణకు తొలుత హైకోర్టు ఆమోదం

ఈ తీర్పును తప్పు పడుతూ సుప్రీంకోర్టుకెళ్లిన టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి

టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ గౌరవాధ్యక్షుడిగా ఉన్న ఏపీపీసీలో ప్రతాప్‌రెడ్డి ప్రధాన కార్యదర్శి

ఇతన్ని ఏపీఎస్‌ఈజీసీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడిగా నియమించిన బాబు ప్రభుత్వం 

టీడీపీ నేత పిటిషన్‌తో ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే.. తిరిగి హైకోర్టులో విచారణ 

టీడీపీ నిర్వాకం వల్ల బీసీలు 9.85 శాతం మేర రిజర్వేషన్లు నష్టపోతున్నారు. తద్వారా వారికి దక్కాల్సిన నాలుగు జెడ్పీ చైర్మన్‌ పదవుల్లో ఒకటి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 65 మండల పరిషత్‌ అధ్యక్ష స్థానాలు, 65 జెడ్పీటీసీ పదవులతో పాటు సర్పంచి పదవులు, వార్డు సభ్యుల పదవులతో కలిపి మొత్తంగా 15,000కు పైగా పదవులు బీసీల చేజారాయి. 

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ వెనుకబడిన తరగతుల (బీసీ) వారికి వ్యతిరేకమని మరోమారు నిరూపించుకుంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మొత్తంగా 58.95 శాతం రిజర్వేషన్ల అమలుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ కోర్టుకు వెళ్లి మోకాలొడ్డింది. రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటుతున్నాయని కోర్టుకు వెళ్లింది టీడీపీ నాయకుడే. టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ గౌరవాధ్యక్షుడుగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌ (ఏపీపీసీ – ఇది ప్రైవేట్‌ సంఘం) ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న బిర్రు ప్రతాప్‌రెడ్డి రిజర్వేషన్ల తగ్గింపు కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. చంద్రబాబు ప్రభుత్వం సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇతనికి ఓ నామినేటెడ్‌ పదవిని కూడా కట్టబెట్టింది. ఉపాధి హామీ పథకం అమలు తీరు పర్యవేక్షించే రాష్ట్ర కౌన్సిల్‌(ఏపీఎస్‌ఈజీసీ) సభ్యుడిగా నియమిస్తూ 2019 మార్చి 9వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.  

ఇదీ రిజర్వేషన్ల కథాకమామిషు.. 
పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో డిసెంబర్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఎస్సీలకు 2013లో ఉన్న 18.30 శాతం రిజర్వేషన్లు 19.08 శాతానికి పెరగగా, బీసీలకు 2013లో అమలు చేసిన 34 శాతం రిజర్వేషన్లనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విభజన తర్వాత ఏపీలో ఎస్టీల జనాభా తగ్గడంతో వారి రిజర్వేషన్లు 9.15 శాతం నుంచి 6.77 శాతానికి తగ్గించారు.

ఈ ఏడాది జనవరిలో రిజర్వేషన్ల కేసును విచారించిన హైకోర్టు 59.85 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణకు అభ్యంతరం తెలపలేదు. దీంతో జనవరి 17వ తేదీన పంచాయతీ రాజ్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పట్లో అన్ని ఏర్పాట్లు చేసింది. అంతలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉన్నాయంటూ బిర్రు ప్రతాప్‌రెడ్డి జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల నిర్వహణకు స్టే ఇచ్చింది. తిరిగి ఈ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర హైకోర్టులో నిర్ణయం జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు సూచనతో తిరిగి విచారణ చేపట్టిన హైకోర్టు సోమవారం రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. 

బీసీలకే ఎందుకు తగ్గుతున్నాయంటే..
59.82 శాతం ఉండే రిజర్వేషన్లు 50 శాతానికి తగ్గించడం వల్ల 9.85 శాతం మేర బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు తగ్గించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం జనాభా నిష్పత్తిన రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉన్నందున వారి రిజర్వేషన్లు తగ్గించే వీలు లేనందున బీసీల రిజర్వేషన్లలో కోత పడుతుందని వివరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top