సీఎం రేసుపై స్మృతి క్లారిటీ

Not Me, Says Smriti Irani On Gujarat Chief Minister Rumours - Sakshi

న్యూఢిల్లీ: గుజరాత్‌ ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపానీని కొనసాగిస్తారా? లేదా కొత్త ముఖాన్ని తెర మీదకు తీసుకోస్తారా? దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో ఆరోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఎవరికి ముఖ్యమంత్రి పదవి కట్టబెడుతుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. కేంద్ర జౌళి, ప్రసార శాఖ మంత్రి స్మృతీ ఇరానీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల, మరో మంత్రి మాన్‌సుఖ్‌ మాందివా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది.  అయితే తాను సీఎం రేసులో లేనని స్మృతీ ఇరానీ స్పష్టం చేశారు. తనను వివాదంలోకి లాగేందుకే ఇటువంటి వదంతులు సృష్టిస్తున్నారని ఆమె అన్నారు.

కాగా, కర్ణాటక గవర్నర్‌ వాజుభాయ్‌ ఆర్‌. వాలా పేరు కూడా వినిపిస్తోంది. 2012 నుంచి 2014 వరకు ఆయన గుజరాత్‌ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. పలుమార్లు రాజ్‌కోట్‌ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైయ్యారు. 1997 నుంచి 2012 వరకు గుజరాత్‌ మంత్రిగా పలు రకాల శాఖలు నిర్వహించారు. మరోవైపు విజయ్‌ రూపానీతో  ఉప ముఖ్యమంత్రిగా నితిన్‌ పటేల్‌ను  కొనసాగించేందుకే బీజేపీ అధిష్టానం సుముఖంగా ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. 2019 సాధారణ ఎన్నికలు జరగనున్నందున ముఖ్యమంత్రిని మార్చడం మంచిదికాదన్న అభిప్రాయంతో కమలం పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. గుజరాత్‌ కేబినెట్‌లో 12 కొత్త ముఖాలకు చోటు దక్కనుందని సమాచారం. ఈనెల 25న  కొత్త ప్రభుత్వం కొలువుతీరే అవకాశముంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top