
మొత్తం 26 మందితో గుజరాత్ నూతన కేబినెట్ ఏర్పాటు
ఉప ముఖ్యమంత్రిగా హర్ష్ సంఘవి నియామకం
గాందీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించారు. సీఎం సహా మొత్తం 26 మందితో నూతన కేబినెట్ కొలువుదీరింది. కొత్తగా 19 మందికి చోటుదక్కింది. తాజా మాజీ మంత్రుల్లో ఆరుగురికి మరోసారి అవకాశం లభించింది. ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాను మంత్రి పదవి వరించడం విశేషం. నిన్నటిదాకా హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన హర్ష్ సంఘవి ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందారు. మంత్రివర్గ సభ్యులతో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా, 27 మందిని మంత్రిగా నియమించేందుకు వీలుంది. సీఎం భూపేంద్ర పటేల్ 26 మందితో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. 2027లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. సరిగ్గా రెండేళ్ల ముందు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం గమనార్హం. అలాగే త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను సైతం దృష్టిలో పెట్టుకొని కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. సీఎం మినహా మొత్తం 25 మందిలో తొమ్మిది మందికి కేబినెట్ ర్యాంకు, ముగ్గురికి స్వతంత్ర హోదా, 13 మందిని సహాయ మంత్రులుగా నియమించారు. గత కేబినెట్‌లో మహిళా మంత్రి ఒక్కరే ఉండగా, ఈసారి ముగ్గురికి స్థానం దక్కింది.
నాలుగేళ్ల తర్వాత డిప్యూటీ సీఎం
సూరత్ జిల్లాలోని మజూరా ఎమ్మెల్యే హర్ష్ సంఘవి గుజరాత్ కేబినెట్‌లో నంబర్ టూ స్థానానికి చేరుకున్నారు. సహాయ మంత్రిగా వ్యవహరించిన ఆయనకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిని నియమించడం గత నాలుగేళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 2021లో విజయ్ రూపానీ ప్రభుత్వంలో నితిన్ పటేల్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. భూపేంద్ర పటేల్ కేబినెట్‌లోని మొత్తం 16 మంది మంత్రులు గురువారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఆరుగురు మళ్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉండగా, 2024 మార్చిలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన పోర్‌బందర్ ఎమ్మెల్యే మోధ్వాడియాకు మంత్రిగా అవకాశం దక్కింది. ఆయన గతంలో గుజరాత్ పీసీసీ అధ్యక్షుడిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న రివాబా
క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు మంత్రి పదవి కట్టబెట్టడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఆమెను కేబినెట్‌లో చేర్చుకుంటారని ఎవరూ ఊహించలేదు. ప్రమాణ స్వీకారానికి రవీంద్ర జడేజాతోపాటు వారి కుమార్తె సైతం హాజరయ్యారు. రివాబా 1990 నవంబర్ 2న జని్మంచారు. 2022లో జరిగిన ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శ్రీ మాతృశక్తి చారిటబుల్ ట్రస్టును స్థాపించారు.