
బీజేపీ పాలనలో దళితులపై అణచివేత పెరిగిపోతోంది
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం
ఉత్తరప్రదేశ్‌లో హత్యకు గురైన దళితుడి కుటుంబానికి పరామర్శ
కాన్పూర్: అధికార బీజేపీపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ పాలనలో దళితులపై అణచివేత నానాటికీ పెరిగిపోతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హరియాణాలో దళిత ఐపీఎస్ అధికారి వై.పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో దళితుడైన హరిఓం వాల్మీకిని దారుణంగా హత్య చేశారని, ఈ హత్యాకాండ మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు.
బాధిత కుటుంబాన్ని బెదిరించి గొంతు నొక్కేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని ఆరోపించాచారు. రాహుల్ గాంధీ శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హరిఓం తండ్రి, సోదరుడు, సోదరితో మాట్లాడారు. సంతాపం ప్రకటించారు. అధైర్యపడొద్దని, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాను ఇక్కడికి రాకుండా ఉత్తరప్రదేశ్ అధికారులు అడ్డంకులు సృష్టించారని రాహుల్ ధ్వజమెత్తారు.
దేశంలో దళితులపై విచ్చలవిడిగా దాడులు జరుగున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన తొలుత మీడియాతో మాట్లాడారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఆ దేశంలో దళితుడిగా జని్మంచడమే నేరమా? అనే ప్రశ్న బాధితుల కళ్లల్లో కనిపిస్తోందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో దళితులపై అకృత్యాలకు పాల్పడిన నేరగాళ్లను కాపాడడం, బాధితులనే శిక్షించడం బీజేపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. న్యాయాన్ని గృహ నిర్బంధంలో ఉంచలేరని తేల్చిచెప్పారు.
హరిఓం వాల్మీకి కుటుంబాన్ని వేధించడం ఇకనైనా మానుకోవాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. హరిఓం వాల్మీకి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దేశంలో ప్రతి బాధితుడికి, అణగారిన వర్గాలకు తన అండదండలు ఉంటాయన్నారు. ఈ పోరాటం కేవలం హరిఓం కోసం కాదని.. అన్యాయానికి తలవంచని ప్రతి గొంతుక కోసం పోరాడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు. 40 ఏళ్ల హరిఓం వాల్మీకిని ఈ నెల 2న రాత్రిపూట గ్రామస్థులు కొట్టిచంపారు. అతడిని దొంగగా భావించి దాడిచేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.