
ప్రపంచంలో తొలి రామాయణ మైనపు బొమ్మల మ్యూజియం
అయోధ్యలో సిద్ధమవుతున్న రాముని కథా ప్రపంచం
దీపోత్సవంలో ప్రారంభం
అయోధ్య: శ్రీరాముడి జన్మభూమి అయోధ్య.. మరో అద్భుత ఘట్టానికి సిద్ధమవుతోంది! ప్రపంచంలోనే మొట్టమొదటి రామాయణ ఇతివృత్తంతో కూడిన భారీ వ్యాక్స్ మ్యూజియం (మైనపు బొమ్మల ప్రదర్శన శాల) త్వరలో ఇక్కడ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో.. దీపోత్సవం–2025 సందర్భంగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీరామ జన్మభూమి మందిరం సమీపంలోని ’పరిక్రమ మార్గ్’లో 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మ్యూజియం రూపుదిద్దుకుంటోంది. దాదాపు రూ.7.5 కోట్లతో నిర్మితమవుతున్న ఈ మ్యూజియం.. అయోధ్యలో మత పర్యాటకాన్ని మరింత పెంచడానికి దోహదపడుతుంది.
50 జీవం ఉట్టిపడే బొమ్మలు: మ్యూజియంలో మొత్తం 50 మంది రామాయణ ప్రధాన పాత్రల మైనపు బొమ్మలను ప్రదర్శించనున్నారు. వీటిలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు, విభీషణుడు తదితర విగ్రహాలున్నాయి. ప్రతి బొమ్మా.. పాత్రల దుస్తులు, ముఖ కవళికలు, భంగిమల్లో జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు.
గ్రౌండ్ ఫ్లోర్: రాముని బాల్యం, సీతాదేవి స్వయంవరం వంటి తొలి ఘట్టాలను ఇక్కడ ప్రదర్శిస్తారు.
మొదటి అంతస్తు: 14 ఏళ్ల వనవాసం, సీతాపహరణం, లంకా దహనం, రామ–రావణ యుద్ధం వంటి కీలక ఘట్టాలను అద్భుతంగా ఆవిష్కరించారు.
సెల్ఫీ పాయింట్: భక్తులు.. బాల రాముడి మైనపు విగ్రహం వద్ద సెలీ్ఫలు తీసుకునేందుకు ప్రత్యేక పాయింట్‌ను ఏర్పాటు చేశారు.
తాదాత్మ్యం చెందేలా..: త్రీడీ లైటింగ్ ఎఫెక్ట్స్, వినసొంపైన సౌండ్‌స్కేప్స్ మ్యూజియాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తాయి.
దివ్య సుగంధం: మ్యూజియం లోపల త్రేతాయుగాన్ని గుర్తుకు తెచ్చే దివ్య సుగంధంతో పాటు, నిరంతరం ‘రామ తారక మంత్రం’పఠనం, రామ భజనలు వినిపిస్తాయి.
నిర్మాణ శైలి: కేరళకు చెందిన ‘సునీల్ వ్యాక్స్ మ్యూజియం’సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను సంప్రదాయ దక్షిణ భారత నిర్మాణ శైలిలో తీర్చిదిద్దుతోంది.
ప్రవేశ రుసుము: ఒక్కొక్కరికి రూ.100. ఒకేసారి 100 మంది సందర్శకులకు మాత్రమే ప్రవేశం కలి్పస్తారు.
సౌకర్యాలు: పూర్తిగా ఎయిర్ కండిషన్ చేసిన ఈ మ్యూజియం వెలుపల పార్కింగ్, స్నాక్ జోన్లు, కాఫీ హౌస్, దక్షిణ, ఉత్తర భారతీయ వంటకాలతో ఫుడ్ కోర్టు వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
భద్రత: ఇరవై నాలుగ్గంటలూ సీసీటీవీ నిఘా, అగ్నిమాపక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
దీపోత్సవానికల్లా పూర్తి
నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, దీపోత్సవం నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు
తెలిపారు. ఈ వ్యాక్స్ మ్యూజియం అయోధ్య సాంస్కృతిక వైభవానికి కొత్త మెరుగులు దిద్దనుంది.