
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్‌లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో కొందరు ప్రధాని మోదీ (PM Modi), మోదీ తల్లి హీరాబెన్‌ని దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. ఈ పరిణామంపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు.
నరేంద్రమోదీని, మోదీ తల్లిని దూషించిన ఘటనను అమిత్ షా తీవ్రంగా ఖండించారు. శుక్రవారం అసోం గువాహటి రాజ్‌భవన్‌లో బ్రహ్మపుత్రా వింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో షా మాట్లాడుతూ.. ‘‘రాహుల్ గాంధీకి ఏమాత్రం సిగ్గున్నా.. మోదీకి, ప్రాణాలతో లేని ఆయన తల్లికి, ఈ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని క్షమాపణలు చెప్పాలి’’అని డిమాండ్ చేశారు.
‘‘రెండు రోజుల కిందట జరిగిన ఘటన..ప్రతీ ఒక్కరినీ బాధించింది. మోదీ తల్లి ఒక పేద కుటుంబంలో విలువలతో బిడ్డలను పెంచింది. అలాంటి తల్లి జీవితాన్ని అవమానించడాన్ని భారతీయలెవరూ సహించలేరు. రాజకీయ జీవితంలో ఇంతకన్నా దిగజారుడు తనం ఇంకొటి లేదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. రాహుల్ గాంధీకి ఏ కొంచెం సిగ్గు మిగిలి ఉన్నా క్షమాపణలు చెప్పాలి’’ అని అమిత్ షా డిమాండ్ చేశారు.
బీహార్‌లో తన యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ రాజకీయాలు అట్టడుగుస్థాయికి చేరాయి. ప్రతి కాంగ్రెస్ నాయకుడు మోదీపై అవమానకరమైన పదాలు ఉపయోగిస్తున్నారు. రాజకీయాల్లో ద్వేష సంస్కృతిని వ్యాప్తి చేస్తోంది కాంగ్రెస్సే. కాంగ్రెస్ ఎంత ఎక్కువ దూషణలు చేస్తే.. బీజేపీ అంత మంచిది.. అంత ఎక్కువగా గెలుస్తుంది కూడా’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల కిందట దుర్భంగా పట్టణంలో నిర్వహించిన సభలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు మోదీ, ఆయన తల్లిని దూషిస్తూ వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించింది. దీనికి సంబంధించి ఆ పార్టీ నేతలు పట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు పలు అనధికారిక ఖాతాల్లో అప్‌లోడ్ అయ్యాయి. అందులో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మోదీని హిందీలో దూషిస్తున్నట్టుగా చూపుతున్న వీడియో క్లిప్పులు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ పరిణామంపై కాంగ్రెస్ ఇప్పటిదాకా స్పందించలేదు.