
దిస్పూర్: తనపై,తన తల్లి హీరాబెన్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను శివభక్తుణ్ని.. కాంగ్రెస్ విమర్శల విషాన్ని హరించేస్తా’అని స్పష్టం చేశారు.
ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ అసోంలో దరంగ్ జిల్లాలో ఆదివారం వేలకోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘నేను ఇలా మాట్లాడితే మోదీ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. నన్ను ఎంత దూషించినా పట్టించుకోను. ఎందుకంటే నేను శివుని భక్తుడిని.. విమర్శల విషాన్ని హరించేస్తా.
నా రిమోట్ కంట్రోల్ వాళ్లే
కానీ దేశ ప్రజలపై దాడి చేస్తే మాత్రం మౌనంగా ఉండను. ప్రజలే నా దేవుళ్లు. నా బాధను వాళ్ల ముందు వ్యక్తం చేయకపోతే .. ఎవరి ముందు చేస్తాను. అందుకే వాళ్లే నా యజమానులు, నా దేవతలు, నా రిమోట్ కంట్రోల్. నాకు వేరే రిమోట్ కంట్రోల్ లేదు’ అని స్పష్టం చేశారు.
చర్చకు దారితీసిన మోదీ రిమోట్ కంట్రోల్ వ్యాఖ్యలు
అయితే, అస్సాం సభలో ప్రధాని మోదీ మరోసారి‘రిమోట్ కంట్రోల్’ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను అప్పటి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ చేశారని మోదీ ఆరోపించారు. అలాగే, ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ కుటుంబం రిమోట్ కంట్రోల్‌లో ఉన్నారని కూడా విమర్శించారు.
2019లో ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రముఖ అస్సామీ సంగీత కళాకారుడు భూపెన్ హజారికాకు భారతరత్న అవార్డ్‌తో సత్కరించింది. ఆ అవార్డుపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శలు గుప్పించారు. మోదీ గాయకులకు, నర్తకులకు అవార్డు ఇస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో ఖర్గే క్షమాపణలు చెప్పారు. ఖర్గే.. భూపెన్ హాజారికాను ఉద్దేశిస్తూ చేసిన విమర్శలను రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ తనతో ప్రస్తావించినట్లు మోదీ తాజాగా సభలో గుర్తు చేశారు.
అవును.. ఖర్గే అనుచితంగా మాట్లాడారు
అవును. భారత ప్రభుత్వం ఈ దేశపు ముద్దుబిడ్డ అస్సాం గర్వకారణం భూపేన్ హజారికాను భారతరత్నతో సత్కరించిన రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీ ఈ అవార్డును ‘గాయకులు, నృత్యకారులకు’ఇచ్చారని అన్నారంటూ అస్సాం సభలో మోదీ గుర్తు చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో.. బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించారు.
ఇటీవల రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రలో మోదీని, మోదీ తల్లిని కొందరు దూషించినట్లుగా ఓ వీడియోను విడుదల చేసింది. ఆ సమయంలో ఆ వీడియోపై ..మోదీ స్పందిస్తూ.. కాంగ్రెస్ తన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగడం సరైందికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బీహార్ కాంగ్రెస్ విభాగం సోషల్ మీడియాలో ఓ ఏఐ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోను మోదీ, తల్లి హీరాబెన్‌ను ఉద్దేశించి ఉండటం తీవ్ర దుమారం రేగింది. కాంగ్రెస్ తనని వ్యక్తిగత హననం చేయడంపై ఇవాళ అస్సాంలో మోదీ స్పందించారు.