
ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు నా తల్లిని అవమానించారు
ఇది దేశంలోని తల్లులు, సోదరీమణులకు జరిగిన అవమానం
ప్రతి వీధిలో, పట్టణంలో ఈ నేతలను గట్టినా నిలదీయండి
బిహార్ ప్రజలకు మోదీ పిలుపు
మహిళా స్వయంసహాయక సంస్థ ఆవిర్భావంలో ప్రసంగించిన మోదీ
పట్నా: బిహార్‌లో రాహుల్‌గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో మోదీ తల్లి దివంగత హీరాబెన్‌నుద్దేశిస్తూ కొందరు విపక్షనేతలు అవమానకరంగా మాట్లాడిన ఉదంతంపై ప్రధాని మోదీ తొలిసారిగా ఆవేదనాభరితంగా స్పందించారు. బిహార్‌లో మహిళల నైపుణ్యాభివృద్ధికి కృషిచేసే కొత్త ‘బిహార్ రాజ్య జీవిక నిధి సహకార సంఘ్ లిమిటెడ్’ను మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించి లక్షలాది మంది మహిళలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ దివంగత నా మాతృమూర్తికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. రాజకీయాలకు దూరంగా ఉండిపోవడమే ఆమె చేసిన తప్పా? ఆమెను మాత్రమే దూషించాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ అంటూ గద్గద స్వరంలో మోదీ తన ప్రసంగాన్ని మొదలెట్టారు.
‘‘ నా తల్లిని అవమానించిన బిహార్ ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలను నేను క్షమిస్తానేమోగానీ దేశంలోని ప్రజలెవ్వరూ వారిని క్షమించబోరు. ఒకరి తల్లిని దూషించిన వారిని ఇంకొకరు పొరపాటున కూడా క్షమించబోరు. తల్లిపై దారుణదూషణోదంతంలో ఆర్జేడీ–కాంగ్రెస్ పార్టీలను బాధ్యులను చేయాల్సిన కనీస బాధ్యత బిహార్‌లోని ప్రతి ఒక్క కుమారుడిపై ఉంది. ఆర్జేడీ–కాంగ్రెస్ నేతలు ఏ వీధిలోకి వెళ్లినా, ఏ పట్టణంలో ప్రచారంచేసినా అక్కడ మాతృమూర్తులు, సోదరీమణులను అవమానిస్తే అస్స లు ఊరుకోబోమని, సహించబోమని గట్టిగా, స్పష్టంగా తెలిసేలా చేయండి’’ అని బిహార్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు.
‘‘ తల్లిపై దుర్భాషలాడిన ఆర్జేడీ–కాంగ్రెస్ నేతలను బిహార్‌లోని తల్లులు, సోదరసోదరీమణులు వీధుల్లోకి వచ్చిమరీ నిలదీయాలి. ఇలాంటివి అస్సలు సహించబోమని స్పష్టంచేయాలి. నన్ను విమర్శించే క్రమంలో తల్లిని, మహిళను తిడితే ఎవ్వరూ ఊరుకోబోరని, తిట్లదండకానికి తెరదించుతామని మీరంతా నిరూపించాలి’’ అని మహిళలకు మోదీ పిలుపునిచ్చారు. బిహార్ రాజ్య జీవిక నిధి సహకార సంఘ్ లిమిటెడ్ అనేది మహిళా స్వయంసహాయక బృందాలకు తక్కువ వడ్డీలకు రుణాలను అందిస్తూ వారి నైపుణ్యాభివృద్ధికి కృషిచేస్తుంది.
జానకీమాతకు జన్మస్థలి
‘‘బిహార్ అనేది జానకీమాతకు జన్మస్థలి. బిహార్ రాష్ట్రం ఎల్లవేళలా మహిళలను గౌరవిస్తుంది. ఆర్జేడీ–కాంగ్రెస్ సంయుక్త రాజకీయ కార్యక్రమం నా తల్లిని అవమానించేందుకు వేదికగా మారడం, అందునా బిహార్‌లో ఈ కార్యక్రమం జరగడాన్ని అస్సలు ఊహించలేదు. ఇది నిజంగా బిహార్ తల్లులు, సోదరీమణులను అవమానించడమే. ఇలాంటి నేతలను బిహార్ ప్రజలు అస్సలు క్షమించరు’’ అని మోదీ అన్నారు. ‘‘ ఆర్జేడీ పాలనా కాలంలో తల్లులు, మహిళలు ఎన్నో అవస్థలు పడ్డారు. నేరçస్తులు, రేపిస్టులు, హంతకులను ఆర్జేడీ ప్రభుత్వం కంటికిరెప్పలా కాపాడుకుంది. తమ కుటుంబసభ్యులు క్షేమంగా రోజూ ఇంటికి తిరిగొస్తారో లేదోనని బిహార్ మహిళలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.
అందుకే తర్వాత మహిళా ఓటర్లు ఆర్జేడీ సర్కార్‌ను ఇంటికి సాగనంపారు. నాడు ఆర్జేడీ కూటమిని ఇంటికి సాగనంపిన అదే మహిళాలు ఇప్పుడు నా తల్లికి జరిగిన అవమానాకి ప్రతీకారం తీర్చుకుంటారు. దర్భంగాలో జరిగిన దుర్ఘటన విపక్షాల కూటమి దారుణాలకు దర్పణం పడుతోంది. రాష్ట్రంలో మహిళలు దోపిడీ, అణచివేతకు గురవుతున్నారు’’ అని మోదీ అన్నారు. ‘‘ కొడుక్కి తన తల్లి అంటే దేవత, దైవంతో సమానం’’ అని భోజ్‌పురీ సామెతను రాబోయే నవరాత్రి, ఛాత్ పండుగలను పురస్కరించుకుని మోదీ గుర్తుచేశారు. ‘‘సూర్యభగవానుని మహిళారూపంలో ఏడుగురు దుర్గామాత అక్కచెల్లెళ్ల రూపంలో బిహార్ ప్రజలు పూజిస్తారు. అలాంటి ప్రజలకు కాంగ్రెస్–ఆర్జేడీ క్షమాపణలు చెప్పాల్సిందే’’ అని మోదీ అన్నారు.
‘‘ దేశసేవకు నా జీవితాన్ని అంకితం చేస్తానని మా అమ్మతో చెప్పినప్పుడు ఆమె అందుకు అడ్డుచెప్పలేదు. పైగా దేశసేవ చేస్తానన్నందుకు అభినందించి ప్రోత్సహించారు. కుటుంబ బాధ్యతల నుంచి తప్పుకుంటానని చెబితే వారించలేదు. పేద తల్లి కుమారుడు అధికారాన్ని(ప్రధాని పదవిని) స్వీకరించడం పేరుగొప్ప నేతలకు అస్సలు నచ్చట్లేదు. మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతినీ వాళ్లు ఓర్వలేకపోతున్నారు. దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా ఆసీనులైన ద్రౌపదీముర్మును సైతం అవమానించడానికి వాళ్లు దుస్సాహసం చేశారు. నాకంటే 20 ఏళ్లు జూనియర్ అయిన(రాహుల్‌గాంధీ) ఓ వ్యక్తి ఓ పదిహేను రోజులు ఎస్‌ఐఆర్‌పై పోరు పేరు చెప్పి యాత్రచేశారు’’ అని రాహుల్‌గాంధీని పరోక్షంగా విమర్శించారు.