
తన మాతృమూర్తి హీరాబెన్‌పై అనుచిత వ్యాఖ్యల పేరిట వైరల్ అయిన వీడియోపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. తన తల్లికే కాదని.. దేశంలోని తల్లులందరికీ ఇది అవమానమేనని భావోద్వేగంగా మాట్లాడారు. బీహార్‌లో మహిళల కోసం బీహార్ రాజ్య జీవికా నిధి సాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ఆయన.. ఆ కార్యక్రమానికి హాజరైన 20 లక్షల మంది మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.
చనిపోయిన నా తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. అయినా అందులోకి లాగారు. కేవలం నా తల్లినే కాదు.. దేశంలోని ప్రతీ తల్లినీ, సోదరినీ కాంగ్రెస్, ఆర్జేడీలు అవమానించాయి అని అన్నారాయన. ఈ మాటలు నా తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించాయి. మీరు కూడా ఈ మాటలు విన్న తర్వాత నాతోపాటు మీరూ ఎంతగా బాధపడి ఉంటారో నాకు తెలుసు అంటూ ఆయన భావోద్వేగంగా స్పందించారు.
అనారోగ్యంతో బాధపడుతూ కూడా నా తల్లి కష్టపడడం ఆపలేదు. మా కోసం దుస్తులు తయారు చేయించేందుకు ప్రతి పైసా ఆదా చేసేది. దేశంలో కోట్లాది తల్లులు ఇలాగే త్యాగం చేస్తూ జీవిస్తున్నారు. తల్లి స్థానం దేవతలకంటే గొప్పది అని ప్రధాని అన్నారు. బీహార్‌లో కాంగ్రెస్–RJD వేదికపై వాడిన అసభ్య పదజాలం తన తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ కుటుంబాల్లో పుట్టినవారు పేద తల్లుల బాధను, వారి కుమారుల పోరాటాన్ని అర్థం చేసుకోలేరు. వీరంతా బంగారు, వెండి చెంచాలతో పుట్టినవారు. బీహార్‌లో అధికారాన్ని తమ కుటుంబాల స్వంతంగా భావిస్తున్నారు. కానీ మీరు ఒక పేద తల్లి కుమారుడిని ప్రధాన సేవకుడిగా ఆశీర్వదించారు. ఇది ‘నామ్దార్’లకు జీర్ణించుకోవడం కష్టమైంది అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, RJD నేత తేజస్వీ యాదవ్‌లపై విమర్శలు చేశారు.
నాపై అసభ్య పదజాలం వాడిన జాబితా చాలా పొడవుగా ఉంది. నన్ను నీచ్, గంది నాళీ కీ కీడా, పాము అని అంటున్నారు. ఇప్పుడు ‘తూ’ అని కూడా సంబోధిస్తున్నారు.. అంటూ రాహుల్ గాంధీ ర్యాలీలో తనను ‘తూ’ అని పిలిచిన విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇలాంటి వ్యాఖ్యలకు మోదీ క్షమించినా.. బీహార్ ప్రజలు క్షమించబోరని అన్నారాయన.
ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ బీహార్‌లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర సందర్బంగా.. దర్భంగలో మోదీ, ఆయన తల్లి హీరాబన్‌ను దూషించినట్లుగా ఓ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ ఘటనపై కేసు నమోదుకాగా.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు కూడా.