హిజాబ్‌ వివాదం..  వేరే పాఠశాలకు విద్యార్థిని  | Kerala Student to move to another school, say parents | Sakshi
Sakshi News home page

హిజాబ్‌ వివాదం..  వేరే పాఠశాలకు విద్యార్థిని 

Oct 18 2025 5:46 AM | Updated on Oct 18 2025 9:28 AM

Kerala Student to move to another school, say parents

తల్లిదండ్రుల నిర్ణయం 

నిబంధనలు పాటిస్తే చేర్చుకుంటాం: ప్రిన్సిపాల్‌ 

కొచ్చి: ఇక్కడి చర్చి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలో హిజాబ్‌ ధారణకు యాజమాన్యం అభ్యంతరం తెలపడంతో, ఆ విద్యార్థినిని మరో పాఠశాలలో చేర్చాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించారు. కాగా, పాఠశాల నిబంధనలకు కట్టుబడితే విద్యార్థిని తిరిగి చదువు కొనసాగించడానికి స్వాగతిస్తామని పాఠశాల యాజమాన్యం స్పష్టం చేసింది. పల్లూరుత్తిలోని సెయింట్‌ రీటాస్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని తండ్రి.. తన కుమార్తెను తిరిగి అదే పాఠశాలకు పంపబోమని స్పష్టం చేశారు.

 ఈ వివాదం తర్వాత తన కుమార్తె తీవ్ర ఒత్తిడికి లోనైందని, తిరిగి అదే పాఠశాలకు వెళ్లడం తనకిష్టం లేదని చెప్పిందన్నారు. వివాదం మొదలైనప్పటి నుండి పాఠశాల ఉపాధ్యాయులు లేదా యాజమాన్యం తమను సంప్రదించలేదని తెలిపారు. ‘నా కూతురు గత రెండు రోజులుగా తరగతులకు హాజరు కావడం లేదు, మాకు స్కూల్‌ నుండి ఎలాంటి సమాచారం అందలేదు’అన్నారు. 

ఈ వివాదంపై విద్యార్థినికి మద్దతు పలికిన కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివన్‌కుట్టి మాట్లాడుతూ.. హెడ్‌స్కార్ఫ్‌ ధరించే ఉపాధ్యాయిని (నన్‌) ఒక విద్యార్థినిని హిజాబ్‌ ధరించనివ్వకపోవడం ఆశ్చర్యకరం, విడ్డూరమని వ్యాఖ్యానించారు. మరోవైపు, పాఠశాల ప్రిన్సిపాల్‌ సిస్టర్‌ హీలీనా ఆల్బీ మాట్లాడుతూ.. విద్యార్థిని పాఠశాల నియమాలను పాటిస్తే.. ఆమె యధాప్రకారం చదువుకోవచ్చని తెలిపారు. ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు.

 తమ పాఠశాలలో భారతీయ సాంస్కృతిక, సంప్రదాయ విలువలను సమ్మిళితం చేస్తూ విద్యను అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. స్కూల్‌ డ్రెస్‌ కోడ్‌కు విరుద్ధంగా.. బాలిక హిజాబ్‌ ధరించడంపై యాజమాన్యం అభ్యంతరం చెప్పడంతో ఈ వివాదం మొదలవడం తెలిసిందే. దీనిపై అక్టోబర్‌ 10న, విద్యార్థిని తల్లిదండ్రులు ఇతరులతో కలిసి పాఠశాలను సందర్శించి యాజమాన్యాని నిలదీశారు, దీంతో పాఠశాల రెండు రోజుల సెలవు ప్రకటించింది. తర్వాత కేరళ హైకోర్టు పాఠశాలకు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement