
విడుదల చేసిన ఐఎంఎఫ్
ఓటింగ్‌కు దూరంగా ఉన్న భారత్
ఇస్లామాబాద్: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి తనకు 100 కోట్ల డాలర్లు మంజూరైనట్టు పాకిస్తాన్ పేర్కొంది. పాక్ ప్రధాని కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటి ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు భేటీలో ఇందుకు ఆమోదముద్ర పడ్డట్టు పేర్కొంది. ఇది పాక్‌కు 700 కోట్ల డాలర్ల ఐఎంఎఫ్ రుణ ప్యాకేజీలో భాగం. ఈ మొత్తాన్ని మూడేళ్ల వ్యవధిలో ఇచ్చేందుకు గత జూలైలో ఐఎంఎఫ్ అంగీకరించింది.
రుణ వాయిదాల వినియోగాన్ని ఆర్నెల్లకోసారి సమీక్షిస్తూ ఏడు వాయిదాల్లో రుణాన్ని అందజేస్తామని పేర్కొంది. తొలి వాయిదాగా గతంలోనే 100 కోట్ల డాలర్లు అందజేసింది. ఈ రుణంపై భారత్ తొలినుంచీ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చుతూ వస్తోంది. ‘‘ఈ నిధులను పాక్ ప్రధానంగా ఉగ్రవాద కార్యకలాపాలపైనే వెచ్చిస్తుంది. అంతిమంగా ఇది భారత్‌కే గాక అంతర్జాతీయ సమాజానికే పెనుముప్పుగా పరిణమిస్తుంది.
కనుక పాక్‌కు రుణసాయాన్ని పూర్తిగా నిలిపేయాలి’’అని కోరుతూ వస్తోంది. పాక్‌కు 100 కోట్ల డాలర్ల విడుదల ప్రతిపాదనను శుక్రవారం నాటి ఐఎంఎఫ్ బోర్డు భేటీలో భారత్ వ్యతిరేకించింది. దానిపై జరిగిన ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది.
‘‘పాక్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని ప్రచారం చేసుకుంటున్న మోదీ ప్రభుత్వం ఓటింగ్‌కు దూరంగా ఎందుకు ఉన్నట్టు? అలాగాక వ్యతిరేకంగా ఓటేస్తే మన వైఖరిని సమర్థంగా వినిపించినట్టుగా ఉండేది’’అంటూ ఆక్షేపించింది. దివాలా స్థితిలో ఉన్న పాక్‌ను చైనా, సౌదీ అరేబియా, ఖతార్‌తో పాటు ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్‌లే ఆర్థికంగా ఆదుకుంటూ వస్తున్నాయి. 2024 నాటికి పాక్ విదేశీ రుణభారం 130 బిలియన్ డాలర్లు దాటింది.