
కొచ్చి: కొచ్చిలోని పళ్లూరుత్తిలో ఒక క్రైస్తవ యాజమాన్యం నడుపుతున్న ప్రైవేట్ పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థిని హిజాబ్ ధరించడంపై.. విద్యాసంస్థ యాజమాన్యానికి.. విద్యార్థిని తల్లిదండ్రులతో వివాదం తీవ్రమవడంతో రెండు రోజుల సెలవు ప్రకటించవలసి వచ్చింది. ఈ విద్యార్థిని తల్లిదండ్రులకు సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఇస్లామిస్ట్ (ఎస్‌డీపీఐ) అనుకూల రాజకీయ సంస్థ మద్దతు ఉందని, ఆ పార్టీ సభ్యులు ఎక్కువగా క్రైస్తవ సన్యాసినులైన విద్యాసంస్థ అధికారులతో దురుసుగా ప్రవర్తించారని పాఠశాల పీటీఏ అధికారి ఒకరు ఆరోపించారు.
ఈ ఆరోపణలపై ఎస్‌డీపీఐ ఇంకా స్పందించలేదు. సెయింట్ రీటాస్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ హెలెనా ఆర్‌సీ విడుదల చేసిన ఒక లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ వివాదం బహిర్గతమైంది. ఈ లేఖలో సోమ, మంగళవారాల్లో పాఠశాలకు సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. నిర్ణీత యూనిఫాం లేకుండా వచ్చిన విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు.. పాఠశాలకు సంబంధం లేని వ్యక్తుల ఒత్తిడితో మానసిక ఒత్తిడి ఎదుర్కొన్న కొంతమంది విద్యార్థులు, సిబ్బంది సెలవు కావాలని కోరారని ప్రిన్సిపాల్ లేఖలో పేర్కొన్నారు. దీంతో పేరెంట్ టీచర్ అసోసియేషన్ కార్యనిర్వాహక సభ్యులతో సంప్రదించాక.. అక్టోబర్ 13, 14 తేదీల్లో సెలవులు ప్రకటించాలని నిర్ణయించినట్లు ఆ లేఖలో తెలిపారు. ‘దేశం హామీ ఇచ్చిన స్వేచ్ఛకు, పాఠశాల యాజమాన్యాల హక్కులకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. మీ నిరంతర సహకారాన్ని ఆశిస్తున్నాం’.. అని అందులో పేర్కొన్నారు.
భయాందోళనలు సృష్టించారు.
పీటీఏ సభ్యుడు జోషి కైతవలప్పిల్ పీటీఐతో మాట్లాడుతూ, పాఠశాల 30 సంవత్సరాలుగా ఒకే విధమైన డ్రెస్ కోడ్‌ను అనుసరిస్తోందని, అన్ని వర్గాల విద్యార్థులు దీనిని పాటించారని స్పష్టం చేశారు. ‘అయితే, ఒక విద్యార్థిని తల్లిదండ్రులు ఆమె తలపై దుపట్టా కప్పుకుని పంపుతామని పట్టుబట్టారు. ఇటీవల, వారు ఒక గుంపుతో పాఠశాలకు వచ్చి రచ్చ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులలో భయాందోళనలు సృష్టించారు. అందుకే రెండు రోజుల సెలవు ప్రకటించాలని నిర్ణయించుకున్నాం’.. అని వివరించారు.
సిస్టర్స్‌తో అనుచిత ప్రవర్తన
పాఠశాల యాజమాన్యం పోలీసు రక్షణ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించి, అనుకూల ఉత్తర్వులు పొందిందని కైతవలప్పిల్ తెలిపారు. ‘పాఠశాలకు వచ్చిన వ్యక్తులు తాము ఎస్‌డీపీఐకి చెందినవారిమని చెప్పుకున్నారు, సిస్టర్స్‌తో సరిగ్గా ప్రవర్తించలేదు’.. అని ఆయన ఆరోపించారు. కాగా, విద్యార్థిని తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తె ఈ విద్యా సంవత్సరం నుంచే పాఠశాలలో చేరిందని చెప్పారు. ‘ఆమె తలపై దుపట్టా ధరించడం వల్ల సమానత్వం దెబ్బ తింటుందని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. ఇంతకుముందు, ఆమెను తరగతి గదిలో దుపట్టా తీసివేయమని అడిగేవారు. కానీ ఇప్పుడు వారు పాఠశాల గేటు వద్ద కూడా అభ్యంతరం చెప్పడం ప్రారంభించారు’.. అన్నారు. దీనిపై జిల్లా విద్యాధికారికి, సంబంధిత మంత్రికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ‘తలపై దుపట్టా కప్పుకోవడానికి అనుమతించకపోతే మా కుమార్తెను మరో పాఠశాలలో చేర్చుతాం.’అని స్పష్టం చేశారు.