
న్యూఢ్లిల్లీ: ‘2024లో గాంధీ కుటుంబం నాతో పోరాడేందుకు నిరాకరించింది. వారు యుద్ధభూమిలోకి కూడా దిగనప్పడు నేను ఏమి చేయగలను? ఇకపై నేను వారిని వెంటాడను’ అంటూ బీజేపీ మహిళా నేత స్మృతి ఇరానీ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇండియా టుడే టీవీతో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మాటల దాడి చేయడం తన బాధ్యతల్లో భాగం కాదని అన్నారు.
రాహుల్ గాంధీపై ఈ మధ్య కాలంలో ఎందుకు మాట్లాడటం లేదనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నుంచి పోటీచేసి, గాంధీ కుటుంబపు కోటను కొల్లగొట్టానని, 2024లో కూడా రాహుల్ గాంధీ తనపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఉంటే, తాను ఆయనను ఖచ్చితంగా ఓడించగలనని ఆమె పేర్కొన్నారు. ఓటమి భయంతోనే రాహుల్ అమేథి నుండి పోటీ చేయలేదని స్మృతి విమర్శించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో, కాంగ్రెస్ అమేథి నుంచి కేఎల్ శర్మను అభ్యర్థిగా నిలబెట్టింది. ఆయన ఇరానీని ఓడించారు. రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌తో పాటు యూపీలోని రాయ్‌బరేలి నుండి కూడా పోటీచేసి గెలుపొందారు.
అమేథీ అంత తేలికైన స్థానం కాదని చరిత్ర తెలియజేస్తోంది. శరద్ యాదవ్ వంటి సీనియర్ నేతలే అక్కడ ఓడిపోయారు. మేనకా గాంధీ కూడా అమేథీ నుండి ఓడిపోయాయరని స్మృతి ఇరానీ గుర్తుచేశారు. ఓటమి ఎదురవుతుందనే సీటును ఏ తెలివైన నాయకుడు ఎంచుకోడు. అయితే పార్టీ ఆదేశిస్తే దానిని విధిగా అంగీకరిస్తారు. 2019లో తాను అసాధ్యాన్ని సుసాధ్యం చేశానని అని ఆమె పేర్కొన్నారు. రాజకీయాల నుండి దూరమవుతున్నాననే వార్తలను స్మృతి తోసిపుచ్చారు. టీవీ సిరీస్ ‘క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ’లో తిరిగి తులసి పాత్రలో కనిపిస్తూ అలరిస్తున్నానని తెలిపారు. భవిష్యత్‌లో పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగిస్తుందో తెలియదని స్మృతి అన్నారు.