ట్రంప్‌తో భేటీలో కశ్మీర్‌ ప్రస్తావనే లేదు

No question of mediation on Kashmir - Sakshi

కశ్మీర్‌ వివాదంలో మధ్యవర్తిత్వానికి అవకాశం లేదు

లోక్‌సభలో స్పష్టం చేసిన రాజ్‌నాథ్‌ సింగ్‌

న్యూఢిల్లీ: జపాన్‌లో జరిగిన జీ–20 సమావేశాల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో  ప్రధాని మోదీ భేటీ అయినప్పుడు కశ్మీర్‌ ప్రస్తావనే రాలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బుధవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. కశ్మీర్‌ వివాదంపై భారత్, పాక్‌ల మధ్యలోకి మూడో దేశం మధ్యవర్తిత్వం కుదరదని ఆయన తెలిపారు. కశ్మీర్‌ వివాదంలో మధ్యవర్తిత్వం చేయాల్సిందిగా మోదీ తనను కోరారంటూ సోమవారం ట్రంప్‌ చెప్పడంతో దేశంలో రాజకీయ దుమారం రేగడం తెలిసిందే.

ఈ విషయంపై స్వయంగా మోదీనే సమాధానం చెప్పాలని ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీలు డిమాండ్‌ చేస్తూ బుధవారం లోక్‌సభలో ఆందోళనలు చేపట్టాయి. దీంతో ఆ విషయంపై చర్చించేందుకు స్పీకర్‌ ఓం బిర్లా సమయం ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం, వారికి సమాధానం చెప్పేందుకు లోక్‌సభ ఉప నాయకుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ లేచిన వెంటనే విపక్షం మళ్లీ ఆందోళనకు సిద్ధమైంది. మోదీనే వచ్చి రెండు సభల్లోనూ సమాధానం చెప్పాలంటూ సభ నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ కశ్మీర్‌ దేశానికి గర్వకారణమనీ, ఈ విషయంలో మధ్యవర్తిత్వానికి అవకాశమే లేదని చెప్పారు. ట్రంప్‌తో భేటీలో మోదీ అస్సలు కశ్మీర్‌ గురించి మాట్లాడిందే లేదనీ, ఇక మధ్యవర్తిత్వం ప్రస్తావన ఎక్కడినుంచి వస్తుందని ఆయన ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top