మోదీ ప్లాన్‌పై నితీశ్‌ నీళ్లు

Nitish Objects PM Modi Simultanious Elections Idea - Sakshi

పట్నా : ప్రధాని నరేంద్ర మోదీ ఆశలపై బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నీళ్లు జల్లుతున్నారు. దేశంలో(లోక్‌సభ-రాష్ట్రాలకు) ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న మోదీ ఆశయం నెరవేరే పని కాదని.. అందుకు తాను కూడా వ్యతిరేకినేనని నితీశ్‌ సంచలన ప్రకటన చేశారు. పట్నాలో ఆదివారం జేడీయూ అంతర్గత సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. 

‘‘దేశంలోని అన్నిరాష్ట్రాలకు, పార్లమెంట్‌ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన సరికాదు. అందుకు నేను అంగీకరించబోను. ఇటీవలే గుజరాత్ ఎన్నికలు ముగిశాయి. కర్ణాటకలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాలూ ఏడాదిలోనే మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతాయని ఎలా భావిస్తారు? అయినా ఎన్నికలు జరిగిన ఏడాదిన్నరలోపే ఆయా రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించటం ఆచరణ సాధ్యం కానే కాదు’’ అని నితీశ్‌ అభిప్రాయపడ్డారు.

ఇక జమిలీ ఎన్నికల్లో భాగంగా బిహార్‌ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను నితీశ్‌ ఖండించారు. 2020 అక్టోబర్‌-నవంబర్‌ సమయంలోనే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని నితీశ్‌ తేల్చిచెప్పారు. దీంతో జమిలీ ఎన్నికలపై బీజేపీకి మిత్రపక్షం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని స్పష్టమైంది. కాగా, నితీశ్‌ వ్యాఖ్యలు మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశమేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

నీతి ఆయోగ్‌ నివేదిక..  అటు కేంద్రంలోనూ (లోక్‌సభ), ఇటు అన్ని రాష్ట్రాల్లోనూ (శాసనసభలు) ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల వృధా ఖర్చు, పరిపాలన స్తంభనను, ఇతరత్రా సమస్యలను అధిగమించవచ్చని నీతి ఆయోగ్‌ అప్పట్లో కేంద్రానికి నివేదించింది. ఇదే అంశంపై గతంలో పార్లమెంటరీ స్థాయీసంఘం, కేంద్ర ఎన్నికల సంఘం, ఇతర సంస్థలు, మేధావులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలన్నింటినీ క్రోడీకరించిన నీతి ఆయోగ్.. ఆ నివేదికను కేంద్రానికి సమర్పించిది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top